జ‌గ‌న్ మాట‌లు న‌మ్మి నిండా మునిగారు!

మరోసారి ఏపీలో అధికారంలోకి వస్తున్నాం. గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయి. 151కిపైగా అసెంబ్లీ, ఎంపీ సీట్లు సైతం గతంలో (22) కంటే ఎక్కువ వస్తాయి. ఈ సారి ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుంది. ప్రజలు సుపరిపాలనను చూసి మద్దతు ఇచ్చారు. ప్రశాంత్‌ కిషోర్‌ కలలోకూడా ఊహించని ఫలితాలు చూస్తాం. ఫలితాలతో దేశంలోని ప్రతీ నేత ఏపీ వైపే చూస్తారు’. - మే 16న ఐప్యాక్ టీం స‌భ్యుల‌తో వైఎస్ జ‌గ‌న్‌

  • Publish Date - June 10, 2024 / 07:20 PM IST

పోలింగ్ ముగిశాక 151 సీట్లు గెలుస్తున్నామ‌న్న జ‌గ‌న్‌
అగ్నికి ఆజ్యంలా ఆరా మ‌స్తాన్ స‌ర్వే
ఆస్తుల‌మ్మి స్థాయికి మించి పందేలు
వైసీపీ సీట్ల‌మీద‌, ప్ర‌భుత్వంమీద ల‌క్ష‌లు, కోట్లు బెట్టింగ్
ఇళ్లు, స్థ‌లాలు, పొలాలు, బంగారు, డిపాజిట్లు ఖాళీ
ల‌బోదిబోమంటున్న వైసీపీ క్యాడ‌ర్‌
అటుఇటుగా ప‌దివేల‌కోట్లు హాంఫ‌ట్
పందెం డ‌బ్బులు చెల్లించ‌లేక ప్రాణాలు తీసుకుంటున్న దైన్యం

(విధాత ప్రత్యేకం)
‘మరోసారి ఏపీలో అధికారంలోకి వస్తున్నాం. గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయి. 151కిపైగా అసెంబ్లీ, ఎంపీ సీట్లు సైతం గతంలో (22) కంటే ఎక్కువ వస్తాయి. ఈ సారి ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుంది. ప్రజలు సుపరిపాలనను చూసి మద్దతు ఇచ్చారు. ప్రశాంత్‌ కిషోర్‌ కలలోకూడా ఊహించని ఫలితాలు చూస్తాం. ఫలితాలతో దేశంలోని ప్రతీ నేత ఏపీ వైపే చూస్తారు’.

– మే 16న ఐప్యాక్ టీం స‌భ్యుల‌తో వైఎస్ జ‌గ‌న్‌

‘ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవనుంది. మహిళలు ఎక్కువగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. వైసీపీ 49.41 శాతం ఓట్లను సాధించి.. 94 నుంచి 101 సీట్లతో అధికారంలో రాబోతోంది. టీడీపీ కూటమి 47.55 శాతం ఓట్లను సాధించి 71-81 స్థానాలకు పరిమితం కాబోతోంది. నా స‌ర్వే క‌చ్చిత‌మైంది. ఫ‌లితాల్లో చెప్పింది చెప్పిన‌ట్లు జ‌ర‌క్క‌పోతే ఆరా మ‌స్తాన్ అనేవాడు ఉండ‌దు’.

 జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ సంద‌ర్భంగా ఆరా మ‌స్తాన్‌.

ఒక‌వైపు సాక్షాత్తూ సీఎం జ‌గ‌న్‌, అగ్నికి ఆజ్యంలా మ‌రోవైపు స‌ర్వేల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న ఆరా మ‌స్తాన్‌, వీటికి అద‌నంగా నెల‌కు ఆరుకోట్లు తీసుకుంటూ సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన హైప్ క్రియేట్ చేసిన ఐ ప్యాక్‌టీం ప్ర‌చారం. స‌గ‌టు వైసీపీ అభిమానికి, నాయ‌కుడికి, కార్య‌క‌ర్త‌కు ఇంత‌కంటే ఏంకావాలి? స్థాయికి మించి వేలు, ల‌క్ష‌లు, కోట్లలో పందేలు కాసేశారు. ఆస్తులు, ఇళ్లు, స్థ‌లాలు, పొలాలు, బంగారు, డిపాజిట్లకు మించి బెట్టింగులు వేశారు. అప్పులు చేసి మ‌రీ తెగ‌బ‌డి క‌ట్టారు. తీరా జూన్ 4న ఫ‌లితాలు చూస్తే వైసీపీ అధఃపాతాళానికి ప‌డిపోయింది. సీట్ల సంఖ్య‌పై వేసిన బెట్టింగులేకాదు, తిరిగి మ‌ళ్లీ వైసీపీ ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంద‌ని వేసిన బెట్టింగులు, ప్ర‌భుత్వం, సీట్ల‌పై డౌట్ ఉండి, సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ గెలుస్తుంద‌ని కాసిన పందేలు కూడా ఘోరంగా ఓడిపోయారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం కాస్త అటుఇటుగా ఏపీ ఎన్నిక‌ల ఫలితాల‌పై ప‌దివేల కోట్ల రూపాయ‌ల బెట్టింగ్ న‌డిచింది. ఫ‌లితాల త‌రువాత ఆర్థికంగా చితికిపోయింది వైసీపీ క్యాడ‌ర్‌. స్థాయికి మించి క‌ట్టిన బెట్టింగు డ‌బ్బులు చెల్లించ‌లేక‌, అలాగ‌ని మొహం చాటేయ‌లేక ఆత్మ‌హ‌త్య‌ల బాట ప‌డుతున్నారు. బాప‌ట్ల జిల్లా బ‌ల్లికుర‌వ మండ‌లం, గంగ‌పాలెం గ్రామానికి చెందిన పెయ్య‌ల రామ‌య్య (64) వ్య‌వ‌సాయ భూమిలోనే విద్యుత్ స్తంబానికి ఉరేసుకుని చ‌నిపోయారు. ఏలూరు జిల్లా టి. న‌ర‌సాపురం మండ‌లం పుట్రేపు గ్రామానికి చెందిన గుర్రం శ్రీ‌నివాస్ (24) ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

30 కోట్లు పందెం కాసి…ప్రాణం తీసుకున్నాడు..

ఈ ఎన్నికల బెట్టింగ్ కు మ‌రో వైసీపీ నేత బలయ్యారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి అధికార పార్టీ విజయం ఖాయమని వైసీపీ నాయకుల పందేల్లో మధ్యవర్తిగా వ్యవహరించి అత్యాశతో తన చేతికి వచ్చిన సొమ్మును మరో పందెంలో కాసి దెబ్బతిన్నాడు. గెలిచిన వ్యక్తులకు సొమ్ము ఇవ్వలేక ఊర్లో నుంచి మాయ‌మ‌య్యాడు. వేణుగోపాల్‌రెడ్డి భార్య వైసీపీ సర్పంచ్‌. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున వేణుగోపాల్‌రెడ్డి బెట్టింగ్‌లు నిర్వహించాడు. 10 శాతం కమీషన్‌పై సుమారు రూ. 30 కోట్ల వరకు బెట్టింగ్ సొమ్ము సేకరించాడు. మంచి వ్యక్తి , సౌమ్యుడిగా పేరుండటంతో వేణుగోపాల్‌ రెడ్డిని బెట్టింగ్ మధ్యవర్తిగా నమ్మారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవటంతో పందెంలో గెలిచిన వ్యక్తులు డబ్బుల కోసం వేణుగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు రాగానే వేణుగోపాల్ రెడ్డి గ్రామంలో కనిపించకుండా పోయి శవంగా తేలాడు.

జ‌గ‌న్‌, ఆరామ‌స్తాన్ మాట‌లు న‌మ్మి ఆర్థికంగా చితికిపోయాం- న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాస్‌

తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు సైతం జ‌గ‌న్‌, ఆరా మ‌స్తాన్ మాట‌లు న‌మ్మి ఆర్థికంగా చితికిపోయిన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ పార్టీ స‌మీక్ష‌లో తన ఆవేద‌న వెళ్ల‌గ‌క్కారు. ఎన్నికల్లో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఐపాక్ టీంతో జ‌గ‌న్ 151 స్థానాలు పైనే గెలుస్తున్నామ‌ని అన‌డంతో చాలా మంది నేతలు, కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. గతంలో లగడపాటి టీడీపీని ముంచినట్లు ఇప్పుడు ఆరా మస్తాన్ సైతం వైసీపీని ముంచాడన్నారు నల్లగట్ల. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సైతం రెండు రోజుల క్రితం ఐపాక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపాక్‌ ఓ పనికి మాలిన సంస్థ అని..అందులో ఉన్న వారంతా డిగ్రీలను అడ్డుపెట్టుకుని జగన్‌ను తప్పుదోవ పట్టించారన్నారు. ఆ సంస్థను నమ్మి ఎన్నికల్లో ఓడిపోయామన్నారు.

Latest News