Site icon vidhaatha

Botsa Satyanarayana | విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక

Botsa Satyanarayana | విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక (Visakha local bodies MLC by-election)లో వైసీపీ  (YCP)అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఎన్నికల అధికారులు అధికారికంగా బొత్స ఎన్నికను ప్రకటించారు. ఆయన మూడేళ్లపాటు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. విశాఖ కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు బొత్స సర్టిఫికెట్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ బీ ఫారం ఇచ్చి పోటీకి ప్రోత్సహించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ (YS Jagan)కు, సహకరించిన వైసీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ (YCP MLC Srinivas) రాజీనామా చేసి జనసేనలో చేరడంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ అధిష్టానం అప్పటి మండలి చైర్మన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. వాటిని పలు దఫాలుగా పరిశీలించి చివరకు ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేశారు. ఖాళీ అయిన విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నిక నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీకి 600 మంది ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కార్పొరేటర్ల సంఖ్యాబలం ఉంది. కూటమికి 200 పైగా మాత్రమే సభ్యులున్నారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన కూటమి ప్రభుత్వం (NDA Govt) టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) సూచనతో పోటీ నుంచి తప్పుకుంది. హుందాగా రాజకీయాలు చేద్దామని, ఎవరిని ప్రలోభ పెట్ట వద్దన్న ఆలోచనతో ఎన్నికల్లో్ పోటీ వద్దంటూ చంద్రబాబు స్పష్టం చేయడంతో కూటమి తమ అభ్యర్థిని పోటీ పెట్టలేదు. పోటీ నుంచి కూటమి ప్రభుత్వం తప్పుకోవడంతో మొత్తం ఇద్దరే నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థిగా, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్‌ వేశారు. బుధవారం స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.

Exit mobile version