విధాత: విజయవాడ బస్టాండ్‌లో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఓ సూపర్ లగ్జరీ బస్సు ప్లాట్‌ఫామ్‌పైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. బస్టాండ్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 12 దగ్గర సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో బాలుడి తీవ్రంగా గాయపడ్డాడు.
విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన లగ్జరీ బస్సు.. డ్రైవర్ రివర్స్ గేర్ వేయడానికి బదులు ఫస్ట్ గేర్‌వేయడంతో ఒక్కసారిగా బస్సు ఫ్లాట్ ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో బస్సు చక్రాల కింద పలువురు ప్రయాణికులు పడ్డారు. ప్రయాణికులను రక్షించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. మృతులను కండక్టర్ వీరయ్య, మహిళ కుమారి, 10 నెలల చిన్నారిగా గుర్తించారు.
ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. వారిని సమీపంలోని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతుందని పోలీసులు తెలిపారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. బస్టాండ్‌లో ప్రమాదస్థలిని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు పరిశీలించారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.