ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై కేసు నమోదు

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. సోనియాగాంధీపై ఆనుచిత వ్యాఖ్యలు చేశారని మల్లు రవి బేగం బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • Publish Date - January 13, 2024 / 01:08 PM IST
  • సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యల పట్ల చర్యలకు ఫిర్యాదు
  • తగ్గేదే లేదన్న నారాయణ స్వామి

విధాత : ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపైన, కాంగ్రెస్‌పైన నారాయణస్వామి ఆనుచిత వ్యాఖ్యలు చేశారని పీసీసీ నేత మల్లు రవి బేగం బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపధ్యంలో పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దివంగత సీఎం వైఎస్సార్‌ మరణానికి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కారణమంటూ ఇటీవల నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణ స్వామి వ్యాఖ్యలపై మల్లు రవి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పని చేసిన వైఎస్సార్‌కు సోనియాగాంధీ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యేక విమానాలను పంపించి మరీ జాడ కోసం వెతికించారని పేర్కొన్నారు. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్‌ మరణించారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని నారాయణస్వామి గ్రహించాలని హితవు పలికారు. ఇప్పటికైనా ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మల్లు రవి నారాయణస్వామిని హెచ్చరించారు. అవాస్తవాలు మాట్లాడిన నారాయణస్వామి పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు.

తగ్గేదే లేదన్న నారాయణ స్వామి

బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో తనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు పెట్టిన కేసుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పందిస్తూ మరోసారి తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించి ఈ వివాదంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహారించారు. సోనియా గాంధీ, చంద్రబాబులు కలిసి రాజశేఖర్ రెడ్డిని హెలికాప్టర్ ప్రమాదంలో చంపారని రాష్ట్ర ప్రజల్లో సందేహం ఉందన్నారు. వాళ్లు ఇద్దరు కలసి వైఎస్ ను చంపారని ప్రజలందరికి తెలుసంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సందేహాన్ని తీర్చే శక్తి సోనియాగాంధీకి, చంద్రబాబుకు లేదన్న ఆయన.. చంద్రబాబుకు రాజకీయ బిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు, సోనియాగాంధీ కలిసి రాజశేఖర్ రెడ్డిని హింసించి పొట్టన పెట్టుకుంది మీకు తెలియదా..? అని ప్రశ్నించారు. ఏ తప్పూ చేయని వ్యక్తి, ఎవడికి భయపడనటువంటి వ్యక్తి వైఎస్ జగన్ ను అన్యాయంగా కేసుల్లో ఇరికించి.. 16 నెలలు జైల్లో పెట్టారని, అప్పుడు ఏమైంది…? మీ కాంగ్రెస్‌ నోర్లు ఎక్కడి పోయాయి..? అంటూ మండిపడ్డారు. ఇక, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పక్కా చంద్రబాబు మనిషి అని, రేవంత్ రెడ్డి గెలవడానికి చంద్రబాబు డబ్బులు పంపించారని విమర్శించారు.

షర్మిల ఎంట్రీ నేపధ్యంలోనే ఆ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి వైఎస్‌. రాజశేఖర్ రెడ్డి కుమార్తె ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇస్తుండటం, ఆమెను ఏపీ పీసీసీ చీఫ్‌గా నియమించబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో తాజాగా వైసీపీ నేతలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం నారాయణస్వామి తాజాగా వైఎస్సార్‌ మరణంపై కాంగ్రెస్‌ను, సోనియాగాంధీని టార్గెట్ చేస్తూ ఆ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.