కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 11వ రోజు కొనసాగుతోంది. పది మందితో కూడిన సీబీఐ బృందం ఇవాళ నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తోంది. పులివెందులకు చెందిన గని యజమాని గంగాధర్, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచారిస్తున్నారు. వివేకా హత్య జరిగిన ప్రదేశంలో సాక్ష్యాల తారుమారు కేసులో గతేడాది అరెస్టు అయిన గంగిరెడ్డి బెయిల్‌పై ఇటీవల విడుదలయ్యారు.
వీరితో పాటు సింహాద్రిపురం మండలం సుంకేశులకు చెందిన జగదీశ్వర్‌రెడ్డి, మరో మహిళను అధికారులు ప్రశ్నిస్తున్నారు. జగదీశ్వర్‌రెడ్డి సుంకేశుల ప్రాంతంలో వివేకాకు సంబంధించిన వ్యవసాయ పనులు చూసుకునే వాడని సమాచారం. దీంతో పాటు ఇతను రోజూ వివేకాను కలిసి ఆయన బాగోగులు చూసుకునే వాడని అధికారుల వద్ద సమాచారం ఉంది. హత్య జరిగిన రోజూ జగదీశ్వర్‌రెడ్డి ఉదయం 6 గంటలకే వివేకా ఇంటికి వెళ్లాడనే సమాచారం నేపథ్యంలో సీబీఐ అధికారులు నిన్న కూడా ఇతడిని ప్రశ్నించారు.