విధాత : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్.చంద్రబాబునాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ఆక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును కొట్టివేయాలన్న క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయాడాన్ని సవాల్ చేస్తూ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్‌ఖన్నా, ఎస్‌విఎన్ భట్టిలు విచారించాల్సివుండగా కేసు విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్లుగా(నాట్ బీ ఫోర్) తెలిపారు.
దీంతో బాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా సీజేఐ చంద్రచూడ్ ముందు మళ్లీ మెన్షన్ చేసి వెంటనే లిస్టు చేయాలని అభ్యర్ధించారు. చంద్రబాబు బెయిల్ కోరుకుంటున్నారా అని సీజేఐ ప్రశ్నించగా, బెయిల్ కోరడం ఉద్దేశం కాదని, పిటిషన్ త్వరగా లిస్టు చేయాలని, మధ్యంతర ఉపశమనం కల్పించాలన్నది రెండో అభ్యర్థనగా లూథ్రా తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరులేని చంద్రబాబును రిమాండ్, కస్టడి చేయాల్సిన అవసరం లేని కేసు ఇది అని వివరించారు.
వ్యక్తి స్వేచ్చపై యశ్వంత్ సిన్హా కేసు అంశాలను పేర్కోన్నారు. బాబును పోలీసు కస్టడీ అడుగుతున్నారని దాని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. లూథ్రా వాదనలను ప్రభుత్వ న్యాయవాది రంజిత్‌కుమార్ త్రోసిపుచ్చారు. వారి వాదనలు విన్న సీజేఐ ఈ కేసు విచారణను మరో బెంచ్‌కు బదిలీ చేసి ఆక్టోబర్ 3న విచారణ చేపట్టనున్నట్లుగా తెలిపారు.
ఇటు అమరావతి ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ కోరుతు చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ విచారణ ఆక్టోబర్ 4వ తేదీకి వాయిదా పడింది. ఇదే కేసులో చంద్రబాబును మరో ఐదు రోజులు కస్టడి కోరుతు సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ విచారణను కూడా అదే రోజుకు వాయిదా వేసింది. రెండు పిటిషన్లపై వాదనలు ఒకేసారి విని ఉత్తర్వులు ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు.
అమరావతి రింగ్ రోడ్డు, పైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లపై విచారణను కూడా కోర్టు 4వ తేదీకే వాయిదా వేసింది. మరోవైపు ఏపీ హైకోర్టులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.