చంద్రబాబుకు ఆ కేసుల్లో ఊరట

చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో ఈ నెల 12వరకు అరెస్టు చేయవద్దని, రింగ్ రోడ్డు కేసులో ఈనె 16వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది

విధాత: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో ఈ నెల 12వరకు అరెస్టు చేయవద్దని, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఈనె 16వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రెండు కేసుల్లో చంద్రబాబు విచారణకు సహకరిస్తారని, అయితే అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. దీనిపై సీఐడీ న్యాయవాది శ్రీరామ్‌ అభిప్రాయాన్ని కోర్టు కోరింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ విచారణ పెండింగ్‌ల ఉందని, ఈ దశలో ముందస్తు బెయిల్ ఇవ్వరాదంటూ వాదించారు.

ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ఐఆర్ఆర్ కేసులో పిటి వారెంట్‌పై స్టే విధించగా, అంగళ్లు కేసులో గురువారం వరకు పీటీ వారెంట్ అడగబోమంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. మరోవైపు ఏసీబీ కోర్టులో బాబు న్యాయవాదులు పైబర్ నెట్ కేసులో దాఖలు చేసిన రైట్ టూ ఆడియెన్స్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో పీటి వారెంట్‌పై వాదనలను సీఐడీ న్యాయవాది వివేక్‌ వినిపించారు.