దుర్మార్గుడి పాలనలో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న రాష్ట్రం!

‘జగన్ రివర్స్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. హైదరాబాద్ వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలబోతోంది’ అని టీడీపీ అధినేత చంద్రబాబు

  • Publish Date - January 7, 2024 / 11:57 AM IST

– రివర్స్ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి..

– మళ్లీ కోలుకోని విధంగా దెబ్బతీసిన జగన్

– రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కదలిరావాలి

– ‘రా.. కదలి రా’ బహిరంగ సభలో చంద్రబాబు పిలుపు

– జనసంద్రమైన తిరువూరు.. కదంతొక్కిన తెలుగు తమ్ముళ్లు

విధాత: ‘జగన్ రివర్స్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. హైదరాబాద్ వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలబోతోంది’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దుర్మార్గుడి పాలనలో రాష్ట్రం మళ్లీ కోలుకోని విధంగా దెబ్బతినిందని, దీన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కదలిరావాలని పిలుపునిచ్చారు. ఆదివారం కృష్ణా జిల్లా తిరువూరులో టీడీపీ ఆధ్వర్యంలో ‘రా..కదలి రా’ బహిరంగ సభ నిర్వహించారు. తెలుగు తమ్ముళ్లు కదంతొక్కగా, సభా ప్రాంగణం జనసంద్రమైంది. ఈ సందర్భంగా బహిరంగ సభనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ఓవైపు హైదరాబాద్ వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలబోతోందన్నారు.



 



ఐదేళ్ల వైసీపీ పానలో ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్టంగా చేశారని, మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పగిస్తే, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని చెప్పారు. ‘మా రాజధాని అమరావతి’ అని గర్వంగా చెప్పుకొనే రోజు వస్తుందని అన్నారు. రుషికొండను బోడిగుండను చేశారన్నారు. అక్కడ రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టి వైసీపీ నేతల విలాసానికి కేంద్రమైందని విమర్శించారు. జగన్ రివర్స్ పాలనే దీనికి కారణమని చెప్పారు. ఈ రాష్ట్రంలో నాతో పాటు అందరూ బాధితులే అంటూ ఆవేదన చెందారు. దుర్మార్గపు, అరాచక పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేదే నా ఆశ

ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని చంద్రబాబు అన్నారు. 25 సంవత్సరాల క్రితం తాను పిల్లలకు ఇచ్చిన ఆయుధం ఐటీ అని చెప్పారు. ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా కృష్ణా జిల్లా వాసులు ఉంటారని, అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వాళ్లు టాప్ అని చంద్రబాబు ప్రశంసించారు. త్వరలో తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయాల్లో రాణించే పరిస్థితి వస్తుందన్నారు. తెలుగు జాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు తెలుగు దేశం పార్టీ ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పరిస్థతి అగమ్యగోచరంగా మారిందన్నారు. ధ్యానం రైతులు దగా పడగా, రాష్ట్ర రైతులు అగ్రభాగం అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉందని, దేశంలోనే కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలవాల్సిన పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతుల బతుకులు బాగుపడాలంటే టీడీపీ-జనసేన ప్రభుత్వం రావాలని, సైతాన్ పోవాలని, రైతే రాజుగా మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

త్వరలో టీడీపీ-జనసేన మ్యానిఫెస్టో

‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో సూపర్ సిక్స్ అందిస్తామని చంద్రబాబు చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు రూ.3వేల భృతి, ‘అన్నదాత’ కింద రైతులకు రూ.20వేలు, ’జయహో బీసీ’ కింద ప్రత్యేక చట్టం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేస్తూ, అన్ని వర్గాల ప్రజల సమ దృష్టితో టీడీపీ-జనసేన మ్యానిఫెస్టో తీసుకువస్తామని చెప్పారు. దొంగ ఓట్లు చేర్పించి గెలుస్తామని కలలు కంటున్న వైసీపీ నేతల ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. తెలుగు దేశం పార్టీ సంక్షేమ పథకాలకు నాంది పలికితే… జగన్ పాలనలో వంద పథకాలు రద్దు చేసే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసమర్థ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సొంతపార్టీ ఎమ్మెల్యేలు కూడా జగన్ ను నమ్మడం లేదని, ఇక ప్రజలు ఎప్పుడో ఆయన్ను ఓడించేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. ఎమ్మెల్యేల బదిలీలతో కొత్త సంస్కృతికి తెరలేపిన వైసీపీ, గుంటూరు ఎంపీ టికెట్ పేరుతో క్రికెటర్ అంబటి రాయుడునూ మోసగించారని ఎద్దేవా చేశారు.