విధాత: ఎన్టీఆర్ భవన్ లో 36గంటల నిరసన దీక్ష చేస్తున్నామని… ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ దీక్ష చేస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో దాడి జరిగింది కాబట్టే ఇక్కడే దీక్షకు కూర్చున్నామని తెలిపారు.ఇది 70లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయం అన్నారు.ఒక పద్ధతి ప్రకారం పక్కా ప్రణాళికతో పార్టీని తుదముట్టించాలనే కుట్రతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు.
కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయాలని యత్నించారని. చిన్నపిల్లల మనోభావాలు లెక్క చేయకుండా పట్టాభి ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు.పార్టీ కార్యాలయంపై దాడి జరగబోతోందని మంగళవారం సాయంత్రం 05:03కి డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించలేదని తెలిపారు.ఇతర పోలీసు ఉన్నతాధికారులకు యత్నించినా స్పందన లేదన్నారు.దీంతో వెంటనే గవర్నర్‌కు ఫోన్ చేస్తే ఆయన స్పందించారని తెలిపారు.
రాష్ట్రం మొత్తం ఏకకాలంలో టీడీపీ కార్యాలయాలు, నేతలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని చెప్పామన్నారు.పోలీసులు, ప్రభుత్వం కలిసి చేస్తున్న దాడిపై తక్షణమే స్పందించాలని అమీత్‌షాను కోరామని ఇది ప్రజలపై, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని తెలిపారు.తనకేమైనా పర్లేదనే వెంటనే పార్టీ కార్యాలయానికి వచ్చానని చంద్రబాబు చెప్పారు.