ఏపీకి విభజన కంటే ఎక్కువ నష్టం జగన్‌ పాలనలోనే: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన కంటే గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనతోనే ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకు పోలవరం ప్రాజెక్టే ఉదాహరణ అని చెప్పారు

  • Publish Date - June 28, 2024 / 08:02 PM IST

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన కంటే గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనతోనే ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకు పోలవరం ప్రాజెక్టే ఉదాహరణ అని చెప్పారు. 2014 నుంచి 2019 మధ్య తన పాలనలో 72 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టులో గత ఐదేళ్లలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో నాలుగు శాతం సివిల్‌వర్క్స్ మాత్రమే జరిగాయని చెప్పారు.‘రాష్ట్రాన్ని విభజించినందుకు తీవ్రంగా నష్టపోయామన్న బాధ మనందరిలో ఉన్నది. కానీ.. 2019 నుంచి 2024 మధ్య జగన్‌ చేసిన విధ్వంసం దానికంటే ఎక్కువ’ అని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు 194 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం కలిగినదని చంద్రబాబు చెప్పారు. 322 టీఎంసీల నీటిని వినియోగించుకుని 7.2 లక్షల ఎకరాల్లో పంటలు పండించేందుకు, 28.5 లక్షల మందికి తాగునీరు ఇచ్చేందుకు, 960 మెగావాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఈ ప్రాజెక్టు ద్వారా అవకాశం ఉన్నదని తెలిపారు. సముద్రంలోకి వెళ్లిపోయే గోదావరి జలాల్లో 500 నుంచి 700 టీఎంసీలను వాడుకునేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పారు.

గతంలో తమ టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై 11,762 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం వెచ్చించింది 4,167 కోట్లేనని చెప్పారు. అప్పటికే పనిలో ఉన్న కాంట్రాక్టర్లను తొలగించి, వేరొకరికి పనులు అప్పగించడం ద్వారా ప్రాజెక్టు కీలక సమస్యలో ఇబ్బందులు ఎదుర్కొన్నదని, నిర్మాణ సమయం, వ్యయం కూడా పెరిగిపోయాయని చంద్రబాబు నాయుడు విమర్శించారు. 2019 ఆగస్ట్‌ 13న పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం వివరాలను తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. కాంట్రాక్టర్లను మార్చవద్దని ప్రాజెక్టు అథారిటీ సమావేశం సిఫారసులను పట్టించుకోలేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ గుడ్డితనంతో వ్యవహరించిందన్న చంద్రబాబు.. 2020 వరదలకు ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్న విషయాన్ని జగన్‌ ప్రభుత్వం రెండేళ్ల తర్వాతే గుర్తించిందని తెలిపారు. 2018లో 436 కోట్లతో డయాఫ్రం వాల్‌ను తమ ప్రభుత్వం అప్పట్లో నిర్మిస్తే.. ఇప్పుడు దానికి మరమ్మతులు చేయడానికే 447 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ప్రాజెక్టులో కీలకమైన ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడాన్ని ప్రస్తావిస్తూ.. ఎత్తు విషయంలో రాజీపడేది లేదని, ముందుగా నిర్ణయించిన ఎత్తు మేరకే ప్రాజెక్టు ఉంటుందని చెప్పారు. జల విద్యుత్తు ప్రాజెక్టుకు ఎత్తు కీలకమని తెలిపారు.ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం విడుదల చేసిన 3385 కోట్ల ను వైసీపీ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకున్నదని చంద్రబాబు విమర్శించారు.

Latest News