CM Chandrababu | శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్ జోన్‌గా తయారు చేయాలనేది తన అలోచనని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీసిటీ ఐజీబీసీ గోల్డెన్ రేటింగ్ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నామని, పచ్చదనం కోసం,వందశాతం వర్షం నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని, శ్రీసిటీకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మారుస్తామని, సహజంగా చల్లనివాతారవణం కల్పనకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లా శ్రీసిటీలో పర్యటించారు. పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. కొత్తగా 7 సంస్థలకు శంకుస్థాపన చేశారు.
ఇక్కడ మొత్తం 15 సంస్థల కార్యకలాపాలను ఆయన ప్రారంభించారు. అనంతరం శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈవోలతో నిర్వహించిన సమావేశంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సీఎం మాట్లాడారు. శ్రీసిటీ చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు శ్రీసిటీ దగ్గరగా ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, ఈ సంపద సంక్షేమానికి దోహదం చేస్తుందని చెప్పారు. ” 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయని, పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించానని, గతంలో పీపీపీ విధానంలో హైటెక్ సిటీ చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు.
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు కనిపిస్తారని, ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉంటారని, ఇందులోని ప్రతి నలుగురిలో ఒక ఏపీ వ్యక్తి ఉంటారన్నారు. శ్రీసిటీలో 8 వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయని, సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీట్రేడ్ జోన్లు వచ్చాయయని, 220 కంపెనీల ఏర్పాటుకు ఇక్కడ అవకాశం ఉందన్నారు. ఒకేచోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యామని, ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ పరిశ్రమలు వచ్చాయని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయని తెలిపారు. 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 4 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించడం చాలా గొప్ప విషయమని, 15శాతం గ్రోత్‌తో అభివృద్ధి చెందడమే లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే నూతన పారిశ్రామిక పాలసీ విడుదల చేస్తామన్నారు.
పైప్‌లైన్‌ల ద్వారా ఏసీ
కొత్త రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతున్నాని, రాజధానిలో గ్యాస్ మాత్రమే కాకుండా ఏసీ కూడా పైప్‌లైన్ల ద్వారా తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడుతామని చంద్రబాబు చెప్పారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34వేల ఎకరాలు ఇచ్చారని, ప్రస్తుతం ఇంటింటికీ నీరు, విద్యుత్, ఫైబర్ నెట్ అందిస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని కోరుతున్నానని, 2029 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, విజన్ 2047 ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, 2047 నాటికి ప్రపంచంలో ఒకటి లేదా రెండు స్థానాల్లో భారత్ నిలుస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు సందర్శనకు, అటు నుంచి విజయవాడకు చంద్రబాబు వెళ్లారు.