రెండో ఏటా ఇచ్చిన మాటకే పెద్ద పీట’ పేరుతో లేఖ, ‘మలిఏడు – జగనన్న తోడు, జగనన్న మేనిఫెస్టో 2019’ డాక్యుమెంట్‌ను క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించిన సీఎం వైయస్.
రెండేళ్ల పాటు తోడుగా నిల్చారు, కృతజ్ఞతలు
వచ్చే మూడేళ్లు కూడా ప్రతి ఆశను నెరవేర్చాలి
ఆ దిశలో అడుగులు ముందుకు వేయాలి
అందుకు తగిన బలం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను
ఈ రెండేళ్ల కాలంలో తోడుగా నిలబడినందుకు రాష్ట్రంలోని.. ప్రతి అక్క, చెల్లెమ్మ, ప్రతి అవ్వ తాత, ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మనస్ఫూర్తిగా చేతులు జోడించి, శిరస్సు ఒంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
దేవుడి దయతో ఈ రెండేళ్ల పాలన సంతృప్తికరంగా మంచి చేయగలిగామన్న తృప్తితో చేయగలిగాం
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ వెల్లడి
అక్కచెల్లెమ్మలకు లేఖతో పాటు, డాక్యుమెంట్ విడుదల
రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా, ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలు, ప్రతి ఇంట్లో కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ, రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో అక్క చెల్లెమ్మలకు వారి పేరుతో రాసిన లేఖతో పాటు, మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఈ రెండేళ్లలో అమలు చేసిన అంశాలు, మేనిఫెస్టోలో చెప్పకుండా అమలు చేసిన వాటిపై డాక్యుమెంట్‌ను క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్ జగన్ ఆవిష్కరించారు.ఈ రెండింటినీ వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికీ పంపించనున్నారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ..
86 శాతం ఇళ్లకు పథకాలు
‘దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఇవాళ మనందరి ప్రభుత్వం రెండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుంది. ఇవాళ మనసుకు సంతోషం కలిగించే విషయం ఏమిటంటే, రాష్ట్రంలో 1,64,68,591 ఇళ్లు ఉంటే వాటిలో 1,41,52,386 ఇళ్లకు, అంటే దాదాపు 86 శాతం ఇళ్లకు దేవుడి దయతో ఏదో ఒక మన పథకం చేరింది’.
ఏకంగా రూ.1,31,725 కోట్లు
‘ఇవాళ రూ.95,528 కోట్లు డీబీటీ ద్వారా, అంటే నగదు బదిలీ ద్వారా, మరో రూ.36,197 కోట్లు పరోక్షంగా (నాన్ డీబీటీ) ద్వారా ప్రజలకు చేరాయి. అంటే వైయస్సార్ ఆరోగ్యశ్రీ, జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యా కానుక, ఇళ్ల స్థలాలు, వైయస్సార్ కంటి వెలుగు వంటి పథకాల ద్వారా అందాయి. ఇవన్నీ లెక్క వేసుకుంటే అక్షరాలా మొత్తం రూ.1,31,725 కోట్లు నేరుగా ప్రజలకు వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి, ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా, నేరుగా ప్రతి పథకం ప్రజల గడప వద్దకే వెళ్లి, నేరుగా అందించగలిగాము’.
‘దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంత గొప్పగా చేయగలిగామని కూడా సగర్వంగా తెలియజేస్తున్నాను’.
వారందరి సహకారంతోనే
‘ఈ స్థాయలో ఇంత మంచి చేయగలిగేందుకు తోడుగా నిల్చిన ప్రతి గ్రామ వలంటీర్, ప్రతి గ్రామ సచివాలయ వ్యవస్థలో పని చేస్తున్న ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడికి, గ్రామ వలంటీర్లుగా లాభాపేక్ష అనేది లేకుండా టోటల్‌గా అంకితభావంతో పని చేసిన ప్రతి చెల్లెమ్మకు అక్కడ, ప్రతి తమ్ముడికి అక్కడ. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ప్రభుత్వంలో పని చేస్తున్న కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరి సహాయ, సహకారాలతో ఇవన్నీ చేయగలిగాము’.
ఇంటింటికీ లేఖ, డాక్యుమెంట్
‘దేవుడి దయతో ప్రజలందరికీ కూడా ఇవాళ రెండు డాక్యుమెంట్లు, ఈరోజు వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికీ చేరడానికి శ్రీకారం చుడుతున్నాం.
ఒక డాక్యుమెంట్, వారి పేరు పెట్టి.. ఇప్పుడు నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఇది’..
‘కంది ఆదిలక్ష్మి, వండ్రంగి గ్రామ సచివాలయం, జి.సిగడాం, శ్రీకాకుళం జిల్లా. ఆ ఆక్కకు సంబంధించింది. ఆ అక్కకు, ఆ కుటుంబానికి దేవుడి దయతో ఏయే పథకాలు ఇవ్వగలిగాము.. ఆ కుటుంబానికి ఎంత మంచి చేయగలిగామని రాస్తున్నాము. అవన్నీ చూపిస్తూ ఆ అక్కకు ఈ లేఖ రాస్తున్నాము’.
‘ఈ లేఖలో ఆ కుటుంబానికి జరిగిన మేలును వివరిస్తూ, ఈ రెండేళ్లలో మనం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశంలో ఏమేం చేయగలిగాము అని చెప్పి లెక్కలతో సహా ఆ అక్కకు చెబుతున్నాము’.
‘మనం ఎన్నికలప్పుడు ఈ మేనిఫెస్టోను ప్రకటించాము. దాన్నే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా భావించి, అందులో చెప్పిన ప్రతి అంశాన్ని కూడా పూర్తి చేయడానికి ఈ రెండు సంవత్సరాలు ప్రతి అడుగు వేశాం.
ఎన్నికల సమయంలో కేవలం రెండు పేజీల మేనిఫెస్టో మాత్రమే ఇచ్చాము. అందులో చెప్పిన వాటిలో ఏమేం అమలు చేశాము? ఎన్నింటికి అడుగులు పడ్డాయి? ఏమేం ఇంకా అమలు కావాలి? ఆ వివరాలతో పాటు, మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ఏమేం చేశామన్నది చెబుతూ ప్రతి ఇంటికి ఒక డాక్యుమెంట్, లేఖ పంపిస్తున్నాము’.
2 ఏళ్లలో 94.5 శాతం అమలు
‘గర్వంగా కూడా చెబుతున్నాను. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఈ రెండు సంవత్సరాలలో దాదాపు 94.5 శాతం అమలు చేశాం. అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో దాదాపు అన్ని వాగ్దానాలు పూర్తి చేశామని, ఇంకా చేయాల్సిన వాటి కోసం అడుగులు వేస్తున్నామని గర్వంగా ఈ సందర్భంగా చెబుతున్నాము. ప్రతి అక్క చెల్లెమ్మకు రాసే లేఖతో ఈ డాక్యుమెంట్ కూడా పంపిస్తున్నాము’.
అక్క చెల్లెమ్మలకు పెద్ద పీట
‘పథకాల్లో దాదాపు 66 శాతం అక్క చెల్లెమ్మలకు పోతున్నాయి. ఆ వివరాలతో కూడిన లేఖతో పాటు, మేనిఫెస్టో అమలుపై డాక్యుమెంట్‌ను వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పంపిస్తున్నాము’.
చేతులు జోడించి, శిరస్సు ఒంచి
‘ఈ రెండు సంవత్సరాల కాలంలో తోడుగా నిలబడినందుకు రాష్ట్రంలోని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మనస్ఫూర్తిగా చేతులు జోడించి, శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’.
రాబోయే మూడేళ్లలో...
‘దేవుడి దయతో ఈ రెండు సంవత్సరాల పరిపాలన సంతృప్తికరంగా మంచి చేయగలిగామన్న తృప్తితో చేయగలిగాం. అదే దేవుడి ఆశీస్సులతో రాబోయే మూడు సంవత్సరాలు కూడా ప్రతి ఆశను కూడా నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేయడానికి తగిన బలం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను’.. అంటూ సీఎం శ్రీ వైయస్ జగన్ తన ప్రసంగం ముగించారు.
ఉప ముఖ్యమంత్రులు (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), కె.నారాయణ స్వామి (ఎక్సైజ్), అంజాద్ బాషా (మైనార్టీ వెల్ఫేర్), హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి బొత్స సత్యనారాయణ, విద్యుత్ శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడి కృష్ణమోహన్, గ్రామ, వార్డు సచివాలయాల సలహాదారు ఆర్.ధనంజయ్‌రెడ్డి, ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు జోగి రమేష్, విడదల రజని, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.