కాంగ్రెస్‌ పార్టీ.. మిషన్‌ ఆంధ్ర!

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో చావుదెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం దిశగా నడిపించడానికి కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్న ప్రయత్నాలు ఏపీ రాజకీయాలను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి

  • Publish Date - December 31, 2023 / 02:38 PM IST
  • పునర్వైభవం సాధనకు కదనోత్సాహం
  • అధికారం సాధించలేక పోయినా..
  • ఉనికి చాటుకోవాలనే తాపత్రయం
  • షర్మిల సారథ్యంలో బలోపేతంపై ఆశలు
  • ప్రత్యేక హోదా ఆయుధంగా జనంలోకి
  • విభజన హామీల అమలే నినాదం
  • నాయకుల ఘర్ వాపసీకి ప్రాధాన్యం
  • టీడీపీ, వైసీపీ అసంతృప్తులకు గాలం

విధాత : రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో చావుదెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం దిశగా నడిపించడానికి కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్న ప్రయత్నాలు ఏపీ రాజకీయాలను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. విభజన అనంతరం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల పాలనను చూసిన ఏపీ ప్రజలు ఆ రెండు పార్టీలు అందించిన పాలనపై అసంతృప్తితో ఉన్నారనే భావనతో ఏపీ కాంగ్రెస్‌ నాయకత్వం ఉన్నట్టు కనిపిస్తున్నది. ఏపీలో కాంగ్రెస్ తిరిగి పుంజుకునేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్.. ‘మిషన్ ఆంధ్ర’ పై ఫోకస్‌ పెట్టింది. ‘జ‌గ‌న్ పోవాలి- కాంగ్రెస్ రావాలి’ వంటి నినాదాలతో పునర్వైభవ సాధన వ్యూహాలకు పదును పెడుతున్నది. ఏపీలో గతంలో కాంగ్రెస్ పాలన, ప‌థ‌కాల‌తో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని అభిమానాన్ని కూడ‌గ‌ట్టారు. అందుకే వైఎస్ నాయ‌క‌త్వంలో ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్ వ‌రుస‌గా రెండుసార్లు అధికారంలోకి వ‌చ్చింది.


యూపీఏ ప్ర‌భుత్వానికి పెద్ద అండ‌గా ఉన్న‌ది కూడా ఉమ్మ‌డి ఏపీ కాంగ్రెస్ ఎంపీల బ‌ల‌మే. వైఎస్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణానంత‌రం సీఎంలుగా వ‌చ్చిన కొణిజేటి రోశ‌య్య‌, న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి సైతం వారి వారి స్థాయిలో కాంగ్రెస్ పేరు చెడ‌గొట్ట‌కుండా పాల‌న చేశారు. కానీ రాష్ట్ర విభజన చేసిందన్న కోపంతో ఏపీ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయకుండా ప‌దేళ్లుగా శిక్షించి దూరం పెట్టారు. అదే సమయంలో కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌పై కోపంతో ఉన్న ఏపీ ప్రజలను, ఆ పార్టీ శ్రేణులను తనవైపు ఆకర్షించడంలో సఫలీకృతమయ్యారు. ఇటు టీడీపీ, అటు వైసీపీల కుటుంబ రాజ‌కీయాలు, నియంతృత్వ పోక‌డ‌ల‌ దెబ్బకు, కాంగ్రెస్ పార్టీపై ఉన్న కోపం కాస్త ఏపీ జనంలో రానురాను త‌గ్గిపోయింది. పదేళ్ల తర్వాత తిరిగి రాజకీయంగా పుంజుకునేందుకు హ‌స్తానికి సానుకూల వాతావ‌ర‌ణం కనిపిస్తుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ కాంగ్రెస్‌కు కొత్త జవసత్వాలు అందించడంపై ఫోకస్ పెట్టిందని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఏకంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోయినా.. స్తబ్దతవీడి ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నం కాంగ్రెస్‌ చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీలకు ఓటేయడం ఇష్టం లేని వర్గాల ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కాంగ్రెస్ కనిపిస్తుందని వారు చెబుతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటకలలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం కూడా ఏపీ కాంగ్రెస్‌కు కొంత జోష్‌ను అందించింది.

ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా…!

రాష్ట్ర విభజన చేసిందన్న కోపం పక్కన పెడితే కాంగ్రెస్ పట్ల జనంలో గుర్తింపు.. సంస్థాగత బలం ఇప్పటికి గణనీయ స్థాయిలోనే ఉన్నాయి. అన్నింటికీ మించి గతంలో మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన సీనియర్ నాయకత్వం అదనపు బలంగా ఉంది. ఒక్కసారి జనం కాంగ్రెస్ వైపు ఆలోచన చేస్తే ఆ పార్టీ ఓటు బ్యాంకు అనూహ్యంగా పెరిగే అవకాశముంది. ఇందుకోసం పార్టీ నాయకత్వాన్ని సంసిద్ధం చేసే వ్యూహాలకు కాంగ్రెస్ హైకమాండ్ పదును పెడుతున్నది. కాంగ్రెస్‌ను కాదని ఏపీ ప్రజలు పదేళ్లలో ఒకసారి టీడీపీకి, మరోసారి వైసీపీకి అధికారం అప్పగించినా కుటుంబ కేంద్రంగా ఆ రెండు ప్రాంతీయ పార్టీలు సాగించిన పాలన జనాన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా టీడీపీ, వైసీపీలు వారి వారి సామాజిక‌వ‌ర్గానికే పదవుల్లో, ప‌నుల్లో ప్రాధాన్యం ఇచ్చేలా వ్యవహ‌రించిన తీరు మిగతా కులాల వారిలో అసంతృప్తిని రాజేసింది. పదేళ్ల టీడీపీ, వైసీపీ పాలనల్లో తమకు సరైన గుర్తింపు, న్యాయం, అవకాశాలు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న కులాలు, సామాజిక వర్గాలు కాంగ్రెస్ వచ్చివుంటే తమకు ఇలా జరిగేది కాదని, సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని నమ్ముతున్నారు. టీడీపీ, వైసీపీ విధానాల పట్ల అసంతృప్తితో ఉన్న జనంలోకి బలంగా వెళ్లగలిగితే ఏపీలో కాంగ్రెస్ తిరిగి తన సంప్రదాయ ఓటు బ్యాంకును అందిపుచ్చుకునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. దీనిలో భాగంగానే ఘర్ వాపసీ పిలుపుతో ఇతర పార్టీల్లోని కాంగ్రెస్ పాత నాయకులను, క్యాడర్‌ను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్న‌ది. పీసీసీ మాజీ చీఫ్‌ రఘువీరారెడ్డికి సీడబ్ల్యూసీ సభ్యత్వం కట్టబెట్టి, తిరిగి పార్టీలో క్రియాశీలకం చేసింది. మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్‌రెడ్డి సైతం తెలంగాణ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌లో చేరారు. మ‌రింత‌మంది క్యూలో ఉన్నార‌ని తెలుస్తోంది.

ప్రత్యేక హోదానే కాంగ్రెస్ ఆయుధం

ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీలకు అధికారం ఇచ్చినా విభజన హామీలను, ప్రత్యేక హోదాను సాధించడంలో విఫలమయ్యాయి. బిజేపీ ప‌దేళ్ల‌లో ఏనాడూ ప్ర‌త్యేక హోదా ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు అదే అంశాన్ని కాంగ్రెస్‌ తన పునరాగమనానికి ఆయుధంగా చేసుకుంటున్నది. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రభుత్వ సారథిగా ఇచ్చిన హోదాను అమలు చేసేది కాంగ్రెస్సేనన్న నినాదంతో జనంలోకి వెళ్లాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో రాహుల్‌గాంధీ తన జోడో యాత్ర సందర్భంగా ఏపీ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.


ఈ నేపథ్యంలో మరోసారి ప్రత్యేక హోదా నినాదంతో ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి ప్రయత్నించాలని కాంగ్రెస్ యోచిస్తున్నది ఉమ్మడి రాష్ట్ర పాలన కాలంలో కాంగ్రెస్‌ ఏపీ అభివృద్ధికి చేసింది చెప్పుకోవడానికి చాలనే ఉండగా.. పదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ, వైసీపీ ఏం చేశాయని ప్రశ్నిస్తూ ఎదురుదాడి సాగించే అవకాశముంది. అలాగే ఏపీకి విభజనతో తాము చేసిన నష్టం కంటే పదేళ్ల పాలనలో టీడీపీ, వైసీపీ, బీజేపీ చేసిన నష్టమే ఎక్కవనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే యోచనలో నాయకత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. విభజన పాపంలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉన్నా.. తమకు మాత్రమే శిక్ష వేశారని, ఇకనైనా తమకు ఒక అవకాశం ఇస్తే విభజన చట్టం హామీలను, ప్రత్యేక హోదాను తెస్తామని తాము ప్రజల్లోకి వెళతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

షర్మిలతో జనాకర్షక నాయకత్వం

రాష్ట్ర విభజన చేసిందన్న పదేళ్ల కోపం జనంలో తగ్గినా.. చెల్లాచెదురైన నాయకత్వం, క్యాడర్‌ను తిరిగి సమీకరించి, ఎన్నికల సంగ్రామంలో ముందుకు నడిపించే జనాకర్షక నాయకత్వం కోసం ఏపీ కాంగ్రెస్ ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా వైఎస్‌ కుమార్తె, షర్మిల పార్టీ అయిన వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఆమెకు ఏపీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో సహజంగానే ఏపీ రాజకీయాల్లో ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. దివంగత సీఎం వైఎస్సార్ పట్ల ఇప్పటికీ జనంలో ఉన్న ఆదరణ, ఆయన కూతురుగా షర్మిలకు ప్రజల్లో ఉన్న చరిష్మా కాంగ్రెస్‌కు కొత్త జవసత్వాలు అందిస్తుందనే నమ్మకంలో పార్టీ హైకమాండ్‌ ఉన్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ‘మిషన్ ఆంధ్ర’ ప్రణాళికను షర్మిలతోనే ముందుకు తీసుకెళ్లేందుకు ఆమెను ఒప్పించే కసరత్తు ఆరంభించింది. ఇదే జరిగితే వైసీపీ అధినేత, తన అన్న వైఎస్‌ జగన్‌ను, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీని ఆమె ఢీకొనాల్సి ఉంటుంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ సారథ్యం చేపడితే వైసీపీలోని పాత కాంగ్రెస్ వాదులు, జగన్ పోకడతో విసుగెత్తిన వారు అంతా తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారని కాంగ్రెస్ అధినాయకత్వం ఆశిస్తున్నది. అంతేగాక టీడీపీ, వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలు, ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లుతారని అంచనా వేస్తున్నది.


టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని నేతలే రేపు కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగినా ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే.. వైసీపీ, టీడీపీలపై ఎంత మేరకు ప్రభావం ఉంటుందనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం షర్మిల పార్టీ అధ్యక్షురాలుగా వస్తారా లేక ప్రచారకర్తగా వస్తారా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ, ఏపీ కాంగ్రెస్‌కు ఆమె సారథ్యం కలిసొస్తుందని హైకమాండ్ ధీమాగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుత పార్టీ చీఫ్ గిడుగు రుద్రరాజు, సీనియర్లు రఘువీరారెడ్డి, కేవీపీ, సుబ్బరామిరెడ్డి, పల్లం రాజు, కనుమూరి బాపిరాజు, హ‌ర్ష‌కుమార్‌, ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ వంటి వారు ఉన్న ప్రత్యర్థి పార్టీలకు దీటుగా కాంగ్రెస్‌ను ప్రజాక్షేత్రంలో నడిపించేందుకు కాంగ్రెస్‌కు ఉన్న కొరతను షర్మిల తీర్చగలరని పార్టీ క్యాడర్‌లో సైతం నమ్మకం కనిపిస్తున్నది.

ఓటు బ్యాంకు పెంచుకోవడమే తక్షణ టార్గెట్‌

ఇప్పటికిప్పుడు ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా కనీసం 15 శాతం ఓటు బ్యాంకు పెరిగిన ఎంపీ ఎన్నికల్లో కొన్ని సీట్లు సాధించవచ్చని కాంగ్రెస్ హైకమాండ్ నమ్ముతుంది. కేంద్రంలో అధికార సాధన నేపథ్యంలో దక్షిణాదిలో ఏపీ రాష్ట్రం తమకు కీలకమని కాంగ్రెస్ విశ్వసిస్తున్నది. అందుకే ఏపీలో కొన్ని ఎంపీ స్థానాలనైనా గెలువాలనుకుంటుంది. ఇందుకు సొంతంగా జనాదరణ సాధించడంతో పాటు పొత్తుల ఎత్తులను కూడా అనుసరించేందుకు పావులు కదుపుతున్నది. ముఖ్యంగా విభజన చట్టం గడువు ముగిసిపోతుండటం.. తాము వస్తేనే విభజన హామీలు, ప్రత్యేక హోదా అమలవుతుందని చెప్పడం ద్వారా ప్రజల్లో తిరిగి పట్టు సాధించాలనేది కాంగ్రెస్‌ ప్రయత్నంగా కనిపిస్తున్నది.


ఏపీలో జనసేన టీడీపీ తోక పార్టీలా మారిపోవడం, బీజేపీ బలంగా లేకపోవడంతో కాంగ్రెస్‌కు టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు అన్ని సానుకూలతలున్నాయని చెబుతున్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేసినా కేసీఆర్‌కు ప్రతికూల ఫలితలు వచ్చాయి. ఇదే పరిస్థితి ఏపీలో ఎదురైనా, కేసీఆర్‌ తరహాలోనే ఉన్న జగన్‌ ఒంటెత్తు ధోరణలపై ప్రజలు విసుగెత్తినా వాటిని క్యాష్‌ చేసుకునే అవకాశం కాంగ్రెస్‌కు కూడా ఉంటుంది. అయితే.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు సరైన వ్యూహం, నాయకత్వం అవసరమనే అభిప్రాయాలు ఉన్నాయి.


ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ కంటే ఏపీలోనే కాంగ్రెస్ బలంగా ఉండేది. ఒక్కసారి కాంగ్రెస్ నాయకత్వంపై జనంలో నమ్మకం కల్గిస్తే చాలని భావిస్తున్న హైకమాండ్ సంక్రాంతి తర్వాత ఏపీలో పలు బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించడంలో జనాదరణ దిశగా పురోగమించాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు కాకపోయిన 2029లో కేంద్రంలో కాంగ్రెస్ రాక తప్పదని అప్పటిలోగా అధికార సాధన దిశగా ఏపీ కాంగ్రెస్‌ను తీర్చిదిద్దాలని కాంగ్రెస్ అధినాయకత్వం కేడర్‌లో కదనోత్సాహాన్ని కలిగిస్తున్నది.