విధాత,నెల్లూరు:సర్వేపల్లి రిజర్వాయరులో ప్రత్యక్షంగా భారీ దోపిడీ జరుగుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వేలాది ఎకరాల ఆయకట్టు కలిగిన సర్వేపల్లి రిజర్వాయర్ కు జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ రోజు ఈ రిజర్వాయర్ మైనింగ్ మాఫియా, ప్రజాప్రతినిధుల చేతుల్లో చిక్కుకుంది. చరిత్రలోనే తొలిసారిగా భారీ దోపిడీ జరుగుతోంది. వ్యవసాయ పొలాలను చదును చేసుకునేందుకని రైతుల పేర్లతో 2 వేలు, 3 వేలు క్యూబిక్ మీటర్ల మట్టిని తోలుకునేందుకు అనుమతి పొంది లక్షల క్యూబిక్ మీటర్లను కొల్లగొడుతున్నారు. అనుమతుల ముసుగులో గత 20 రోజుల నుంచి రిజర్వాయర్ లో గ్రావెల్ తవ్వకాలు రేయింబవళ్లు, సెలవు రోజులు అనే తేడా లేకుండా జరిగిపోతున్నాయి..సాయంత్రం 5 గంటల తర్వాత తవ్వకాలు చేయకూడదనే నిబంధన ఉన్నా తుంగలో తొక్కి 24 గంటలూ తవ్వేస్తున్నారు. నిత్యం 4 భారీ ప్రొక్లెయిన్లు, 30 భారీ టిప్పర్లతో దందా సాగుతోంది. ఒక్కో టిప్పర్ రోజుకి 10 ట్రిప్పులు వేసినా, 30 టిప్పర్లు కలిసి 300 ట్రిప్పులు వేస్తున్నాయి..రోజూ ఐదారువేల క్యూబెక్ మీటర్ల గ్రావెల్ నెల్లూరు నగర సమీపంలోని లేఅవుట్లకు తరలిపోతోంది.. ఇప్పటికే లక్షలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ను కొల్లగొట్టేశారు..స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఈ దోపిడీ జరుగుతోంది.
ఇరిగేషన్ మంత్రి సొంత జిల్లాలో ఇంత భారీ దొపిడీ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది. ఇరిగేషన్ అధికారుల మౌనం చూస్తుంటే ఈ దోపిడీలో సంబంధిత మంత్రికి కూడా వాటాలుండాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈ భారీ స్కాం ఎమ్మెల్యేదా..మంత్రిదా లేక ఇద్దరిదా..తేలాల్సిన అవసరం ఉంది..
ఇంత జరుగుతుంటే ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖలు కళ్లు మూసుకున్నాయా. ప్రభుత్వ శాఖలు, చట్టాలు ఎమ్మెల్యేలను చూసి ఇంతగా భయపడి దాక్కోవలా….చెరువు భద్రతపై రైతు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తే..వాళ్ల ప్రభుత్వం, వాళ్లు తోలుకుంటారు, మధ్యలో మీరెవరని సాక్షాత్తు ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆగ్రహం వ్యక్తం చేయడం శోచనీయం. అసలు చెరువు భద్రత ఇరిగేషన్ అధికారులకు పట్టకపోవడం బాధాకరం. కనీసం రిజర్వాయర్ భధ్రతపై నిపుణులతో పరిశీలన అయినా చేశారా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. సర్వేపల్లి రిజర్వాయర్ లో అనుమతుల పేరుతో జరుగుతున్న అక్రమ దందాను వెంటనే ఆపాలి. విచారణ జరిపి అనుమతికి మించి తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని, సర్వేపల్లి రిజర్వాయర్ ను కాపాడాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Readmore:ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా..? అచ్చెన్నాయుడు