ఉన్నమాట: పురంధేశ్వరికి బీజేపీలో నూకలు చెల్లిపోయాయా ? ఇక అక్కడ మనగలగడం దుర్లభమేనా.. ఆవిడ మనిషిగా బీజేపీలో ఉంటూ మనసంతా టీడీపీతో ఉందని, కొడుకు పొలిటికల్ కెరీర్ కోసం టీడీపీతో సన్నిహిత సంబంధాలు నెరపడం బీజేపీ పెద్దలకు ఇష్టం లేనందుకే ఆమెను చత్తీష్‌గడ్ ఇంచార్జ్ పదవి నుంచి బీజేపీ తొలగించిందా.. ఏమో చూడాలి.. మున్ముందు ఏమవుతుందో చూడాలి.
ఎన్టీయార్ కుమార్తె అయిన పురంధేశ్వరి ఆనాడు కాంగ్రెస్‌లో చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఏదైతేనేం బాపట్ల నుంచి ఓసారి.. విశాఖ నుంచి ఇంకోసారి లోక్‌సభకు వెళ్లి కేంద్రమంత్రిగా సమర్థంగా పని చేశారు. కాంగ్రెస్ కేంద్రంలో ఓడిపోగానే పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.. ఆ తరువాత రెండు సార్లు ఆమె బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
ఇక 2019లో విశాఖ నుంచి పోటీ చేస్తే ఏకంగా డిపాజిట్లే గల్లంతయ్యాయి. బీజేపీలో తనకు ప్రధాన్యమైన పదవి వస్తుందని భావించినా దక్క లేదు. అటు రాజ్యసభ పదవి కానీ.. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి గానీ వస్తుందనుకుంటే జరగడం లేదు. అయితే ఆమధ్య ఆమెను ఒరిస్సా.. చత్తీషుగడ్ ఇంచార్జ్ గా వేసిన అధిష్టానం కొద్ది రోజులకే ఆ పదవుల నుంచి కూడా తప్పించింది.
మరో వైపు చూస్తే బీజేపీ అధినాయకత్వం కూడా ఎన్టీయార్ కుమార్తె అన్న భారీ ట్యాగ్‌ని చూసే పార్టీలో చేర్చుకుందని అంటున్నారు. పైగా కేంద్రమంత్రిగా పనిచేశారు. పొలిటికల్‌గా చూస్తే ఏపీలో బలమైన సామాజిక నేపధ్యం ఉంది. దాంతో ఆమె ఏపీ రాజకీయాల్లో ప్రభావవంతంగా ఉంటారని, బీజేపీని పటిష్టం చేస్తారని అధిష్టానం ఆశించినా ఆమె ఆమేరకు పని చేయలేదని స్పష్టం అవుతోంది.
ఆమె తండ్రి స్థాపించిన టీడీపీ నుంచి ఒక్క నాయకుడిని కూడా బీజేపీ వైపుగా తేలేకపోయారు అన్న ఆగ్రహం హై కమాండ్‌లో ఉంది. ఆమెను పార్టీలో ఎంత పెద్దగా చూపించినా ఆమె తన ప్రభావమైతే చూపించ లేకపోతున్నారు అన్న లెక్కకు బీజేపీ హై కమాండ్ వచ్చిందని చెబుతున్నారు.
ఇక ఆమె టీడీపీతో టచ్‌లోకి వెళ్తున్నారన్న అనుమానాలు కూడా పార్టీ పెద్దలలో ఉన్నాయట. ఆమె కుమారుడు కూడా రేపటి రోజున టీడీపీ నుంచే పోటీ చేస్తారన్న వార్తలు ప్రచారం కావడం పట్ల కూడా బీజేపీ హై కమాండ్ ఆలోచిస్తోందని అంటున్నారు. అందుకే ఆమెకు మెల్లగా ప్రాధాన్యతలు తగ్గించారని అంటున్నారు.
ఆమె బీజేపీలో ఉంటూ టీడీపీకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు కూడా రావడంతోనే ఆమెని కాస్తా పక్కన పెడుతున్నారని అంటున్నారు. ఏపీలో బీజేపీ పరిస్థితి గొప్పగా ఏమి లేదు. కాబట్టి ఆమె కుమారుడు చెంచురామ్ టీడీపీ నుంచే పోటీ చేసేందుకు ఆస్కారం ఉంది. ఈ పరిస్థితులన్ని అధిష్టానం గుర్తించి ఆమెను మెల్లగా పార్టీ పదవుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.