Site icon vidhaatha

ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

విధాత‌: దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఈనెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తర్వాత 48 గంటల్లో అల్పపీడనం బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. మరోవైపు శ్రీలంక తీరప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో… రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 7 సెం.మీ నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని…. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఆసమయంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నందున డిసెంబర్ 1వ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని సూచించారు.

Exit mobile version