విధాత:కడప జిల్లా మైదుకూరు సమీపంలోని అన్నలూరు గ్రామానికి ఘనమైన చరిత్ర ఉన్నా పురావస్తు శాఖ నిర్లక్ష్యం వల్ల ఆ చరిత్ర శిధిలమవుతోంది.
ఏంతో ప్రాధాన్యత కలిగిన అన్నలూరు జయస్తంభ శాసనం కాలగర్భంలో కలిసిపోతోంది.
కాయస్థ రాజు జన్నిగదేవ మహారాజు కంచి పాలకుడైన సిద్ధయదేవ మహారాజును సోమశిలవద్ద యుద్ధంలో సంహరించాడు.
ఆ సందర్భంగా శాలివాహన శకం 1183 (క్రీస్తు శకం. 1261) దుర్మతి నామ సంవత్సరం మాఘ శుద్ద ఏకాదశినాడు అన్నలూరు వద్ద భీమ లింగాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించి యుద్ధ విజయానికి సంబంధించిన జయస్తంభ శాసనాన్ని ఆ గుడి వద్ద చెక్కించారని చరిత్ర చెబుతోంది.
కాలక్రమం లో ఈ ఆలయం పడుబాటు అయింది. చరిత్ర కలిగిన జయస్థంభ శాసనం అన్నలూరు వద్ద గల ఈ గుడి శిధిలాల కింద సమాధి అయిపొయింది. చాల ఏళ్లకిందట గుడివద్ద స్తంభంపై చెక్కిన శాసనాన్ని తాము చూశామని గ్రామస్తులు తెలుపుతున్నారు.
ప్రస్తుతం గుడికి సంబంధించిన శివలింగం, వినాయక విగ్రహం , పానవట్టం, నాగశిలలు, శ్రీవల్లీ సమేత కుమారస్వామి శిల్పాలు, కొన్ని వీరగల్లులు చాలా ఏళ్లుగా సమీపంలోని పొలంలో పడిఉన్నాయి. నంది విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
భీమేశ్వర ఆలయం చారిత్రక విశిష్టత
అన్నలూరు భీమేశ్వర ఆలయం పేరు మీదనే ఈ గ్రామానికి సమీపంలోని భీమలింగాయపల్లె ఆవిర్భవించింది. జన్నిగదేవ మహారాజు కడప జిల్లా వల్లూరు పాలకుడైన కాయస్థ అంబదేవుని సోదరుడు. అంబదేవుడు యుద్ధంలో రుద్రమదేవిని వధించినట్లు చందుపట్ల శాసనం తెలుపుతోంది. అలాగే ఈ జన్నిగదేవ మహారాజు,కాకతీయ గణపతిదేవ మహారాజు అగ్రసేనాని అయిన గంగయ సాహిణి కి మేనల్లుడు. గంగయసాహిణి అసలుపేరు తిక్కరసు గంగరాజు. కాగా అన్నలూరు శాసనానికి రెండేళ్ళ ముందు అంటే శాలివాహన శకం 1181 సిద్ధార్తి నమ సంవత్సరంలో గంగయసాహిణి పేరుమీద మైదుకూరు ను “మైతకూరి గంగరాజు పట్టణం ” గా పేర్కొంటూ మైదుకూరి శాసనం వెలిసింది.
ఇలాంటి ఘన చరిత్ర కలిగిన అన్నలూరు భీమేశ్వర ఆలయ శిల్ప సంపదను, జయస్తంభ శాసనాన్ని కాపాడేందుకు రాష్ట్ర పురావస్తు శాఖ దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
-తవ్వా ఓబుల్ రెడ్డి