ఏపీలో బీజేపీకి భవిష్యత్తు .. ఆశాకిరణం పవనేనా?

న్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్రమోదీ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ప్రత్యేక ప్రశంసించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్డీఏ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారని ప్రశంసించారు.

  • Publish Date - June 8, 2024 / 12:56 AM IST

జనసేనానిపై మోదీ ప్రశంసల వెనుక!
టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్డీయేకు లాభం
ప్రాంతీయ పార్టీలను సహించని మోదీ
అన్ని రాష్ట్రాల్లో పాగా బీజేపీ టార్గెట్‌
సఖ్యత ఉన్నంత వరకూ సర్దుకుపోయే బీజేపీ
తేడా వస్తే.. మిత్రులనూ చీల్చిన చరిత్ర
ఏపీలో పరిస్థితి వస్తే పవన్‌ పైనే ఆశ?
(విధాత ప్రత్యేకం)
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్రమోదీ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ప్రత్యేక ప్రశంసించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్డీఏ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారని ప్రశంసించారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు.. సునామీ అంటూ ప్రశంసలు కురిపించారు.
ఏపీలో చంద్రబాబు జైలులో ఉండగానే కూటమి ప్రతిపాదన చేసింది పవన్‌.

జైలులో బాబుతో భేటీ అనంతరమే ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. దీనిపై జనసేన కార్యకర్తలు, ఆయన సామాజికవర్గ కాపు నేతల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా వెనక్కి తగ్గలేదు. జగన్‌ను ఎదుర్కోవాలంటే ఒక్క ఓటు కూడా చీలిపోకూడదనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకోవడం మొదలు సీట్ల సర్దుబాటు వరకు రాజీపడ్డారు. అంతేకాదు పవన్‌ కల్యాణ్‌తోనే బీజేపీ కూటమిలో కలిసింది. బీజేపీ వచ్చాక సీట్ల సర్దుబాటు విషయంలో కొన్ని సమస్యలు తెలెత్తినప్పుడు రఘురామ కృష్ణంరాజు లాంటి వాళ్లు బాబుపై విమర్శలు చేశారు.

కానీ జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకే పరిమితం కావడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. వైసీపీ వాళ్లు అయితే ఏకంగా దీనిపై సెటైర్లు వేశారు. ఈ మాత్రం దానికి వారాహి వాహనం అవసరమా? అని ఎద్దేవా చేశారు. కానీ నాడు పవన్‌ కల్యాణ్‌ ఎందుకు తగ్గాడు? కూటమి ఉధృతికి వైసీపీ అధినేత జగన్‌ కూడా ఊహించని ఫలితాలు ఎందుకు వచ్చాయో అర్థమైంది. ఏపీలో బలమైన రెండు సామాజిక వర్గాలైన కమ్మ, కాపుల ఓట్లు గంప గుత్తగా కూటమికి పడ్డాయని తెలుస్తోంది. అందుకే పవన్‌ను ప్రధాని అంతలా పొగిడారని అంటున్నారు. పవన్‌ వల్ల టీడీపీకి కలిగిన లబ్ధి ఒక ఎత్తయితే.. కమలం పార్టీకి కలిగిన లబ్ధి మరో ఎత్తు. టీడీపీతో పొత్తే లేకుండి ఉంటే.. ఈ రోజు ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు సందేహాస్పదంగా మారి ఉండేది. కేంద్రంలో మెజారిటీకి దూరంగా ఉన్న బీజేపీని ఏపీ నుంచి టీడీపీ ఆదుకున్నది. ఒకవేళ కూటమి లేకుండా విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు ఎలా ఉండేవో చెప్పలేం.

పోటీచేసిన అన్ని స్థానాల్లో (21 అసెంబ్లీ, 2 ఎంపీ) జనసేన విజయపతాకం ఎగురవేసి రికార్డు సృష్టించింది. గత ఎన్నికల్లో రెండుచోట్లా పోటీ చేసి ఓడిపోయిన పవన్‌ నిరాశ పడకుండా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వచ్చాడు. జగన్‌ను గద్దె దించడమే ధ్యేయంగా ఐదేళ్లు పోరాడాడు. ఆయన పోరాట పటిమ ఫలితాల తర్వాత తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజనను పవన్‌ కల్యాణ్‌ తప్పుపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఇక్కడ బీఆర్‌ఎస్‌ నేతలతోనూ సత్సంబంధాలు కొనసాగించినా రాష్ట్ర విభజనకు కారణం కాంగ్రెస్‌ పార్టీనే అన్నది ఆయన అభివప్రాయం. అందుకే ఆ పార్టీ గెలువాలని ఆయన ఎన్నడూ కోరుకోరు. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వక్తం చేస్తే ప్రధాని మోదీ తన అక్కసును అనేకసార్లు పార్లమెంటు వేదికగానే వెళ్లగక్కారు.

దేశంలోని అన్నిరాష్ట్రాల్లో పాగా వేయాలన్నది బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళిక. దానికి ఏపీ కూడా మినహాయింపేమీ కాదు. ప్రస్తుతం అక్కడ ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి పురంధేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగించినా వచ్చే అసెంబ్లీ నాటికి అక్కడి రాజకీయాలు మారినా ఆశ్చర్యపోనక్కరలేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దానికి బీజేపీ కార్యాచరణ తప్పకుండా సిద్ధం చేస్తుందని చెబుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే ప్రధాని ఇక్కడ కూర్చున్నది పవన్‌ కాదు సునామీ అన్నారని అనుకోవచ్చని పేర్కొటున్నారు. ఎన్టీఏ కూటమిలో ప్రాంతీయ పార్టీలతో సఖ్యత కొనసాగినంత కాలం కమలనాథులు సర్దుకుపోతారు. తేడా జరిగితే చీలుస్తారు. కూలుస్తారు. ఈ క్రమంలోనే బీజేపీ ఏపీ భవిష్యత్తు ఆశాకిరణం పవన్‌ కల్యాణ్‌ అయినా ఆశ్చర్యపోనక్కరలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Latest News