నాడు జేపీ..నేడు జేడీ..! మధ్యలో ఆరెస్పీ

సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ లక్ష్మినారాయణ కొత్తగా ప్రక‌టించిన ''జై భారత్ నేషనల్ పార్టీ'' వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

  • Publish Date - December 23, 2023 / 12:21 PM IST
  • కొత్త పార్టీల సక్సెస్‌పై సందేహాలు
  • ఏపీలో పొలిటికల్ గ్యాప్ ఎంత?



విధాత: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కొత్తగా ప్రక‌టించిన ‘జై భారత్ నేషనల్ పార్టీ’ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్త పార్టీల పుట్టుక పుట్టగొడుగులను.. ఆరుద్ర పురుగులను తలపించే రీతిలో సాగుతున్న క్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ నేటీ రాజకీయాల్లో ఎంతమేరకు జనాదరణ సాధించి నిలబడుతుందన్నదానిపై జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి.


ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్ర‌వ‌చ‌న‌కారులు చాగంటి కోటేశ్వ‌ర‌రావు, గరికపాటి న‌ర‌సింహారావు తరహాలో నిన్నటిదాకా కేవలం రాజకీయ, సామాజిక, సంస్కరణ ఉపన్యాసాలకే పరిమితమైన జేడీ అకస్మాత్తుగా పార్టీ పెట్టి 175 స్థానాల్లో పోటీ చేసి, అధికారంలోకి వస్తామని, ఏపీ ప్రజలను ఉద్ధరిస్తానని, పాలనలో మార్పులు తెస్తానని, ప్ర‌త్యేక హోదా సాధించి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని పార్టీ ఆవిర్భావ స‌భ‌లో భారీ ప్రకటనలు చేశారు.


సీబీఐ మాజీ డైరెక్టర్‌గా గతంలో ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్ర‌మ ఆస్తుల కేసుల విచారణ చరిత్ర తప్ప జేడీకి పార్టీ పెట్టకముందు ఎలాంటి రాజకీయ, ప్రజా ఉద్యమాలు నిర్వహించిన నేపథ్యం లేదా ఏదో ఒక సొంత సంస్థాగత నిర్మాణం సైతం లేదు. ఆయ‌న పోలీసు అధికారిగా వీఆరెస్ తీసుకున్నాక అటు కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌నుకానీ, ఇటు తెలుగు రాష్ట్రాల‌లో ఉన్న ప్ర‌భుత్వాల ప‌నితీరును కానీ క‌నీసం ప్ర‌శ్నించిన పాపాన పోలేదు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను, అప్ర‌జాస్వామిక విధానాల‌ను ఎక్క‌డా గొంతెత్తి విమ‌ర్శించ‌లేదు.


కేంద్రంలో మోదీ జ‌పం, తెలుగు రాష్ట్రాల‌లో ఇటు కేసీఆర్‌, కేటీఆర్‌ల‌ను, అటు వైఎస్ జ‌గ‌న్‌ను వీలైన‌ప్పుడ‌ల్లా పొగుడుతూ కాలం గ‌డిపేశారు. ఉద్యోగుల స‌మ‌స్య‌ల విష‌యంలోనూ ఏనాడూ పెద‌వి విప్ప‌లేదు. మ్యానిఫెస్టో హామీల‌ను నెర‌వేర్చాలని ఏపీ ఉద్యోగులు రోడ్డెక్కిన‌ప్పుడుకానీ, చీప్ లిక్క‌ర్‌ను భారీ రేట్ల‌కు అమ్మిన‌ప్పుడుకానీ, ప్ర‌తిప‌క్షాలపై అప్ర‌జాస్వామ్యంగా కేసులు న‌మోదు చేసిన‌ప్పుడుకానీ, ప్ర‌త్యేక హోదా విష‌యంలోకానీ ఎక్క‌డా ప‌ల్లెత్తు విమ‌ర్శ చేయ‌లేదు. కనీసం అధికార పార్టీల విధానాలపైన, పాలనా వైఫల్యాలపైన ఏనాడూ నోరెత్తిన‌ దాఖలాలు లేవు.


కేవలం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తనదైన శైలిలో ప్రకటన చేసి, ఉక్కు ఫ్యాక్టరీని ఓ కంపెనీతో కొనిపించి నడిపించేలా చేస్తానని జనానికి చెప్పి చివరకు చేతులెత్తేసి నవ్వుల పాలయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు పార్టీని ప్రకటించి రాష్ట్రంలో అధికార సాధనకు అవసరమైన సీట్లు గెలుస్తామన్న జేడీ ప్రకటన ఇప్పుడు కేఏ పాల్ త‌ర‌హా పొలిటిక‌ల్ కామెడీగానే క‌నిపిస్తోందికానీ, ఎక్క‌డా క‌నీసం ప్ర‌భావం చూపే అవ‌కాశం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


రాజకీయ ఎదురీతలో మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ల ప్రస్థానం


గతంలో మాజీ ఐఏఎస్ డాక్టర్ నాగభైరవ జయప్రకాశ్ నారాయణ 2006 ఆక్టోబర్ 2న లోక్‌సత్తా పార్టీని ప్రకటించారు. అంతకుముందు పదేళ్ల పాటు ఆయన లోక్‌సత్తాను సామాజిక సంస్థగా కొనసాగించి జనంలో కొంత ఉనికి సాధించాక రాజకీయ పార్టీగా మార్చారు. పాలనలో అవినీతి నిర్మూలన, సుపరిపాలన, స్వపరిపాలన, స్వేచ్ఛ, పౌర సాధికారికత వంటి నినాదాలతో అప్పటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేధావులు, విద్యార్థులు, తటస్థులు, మార్పు కోరుకునే వర్గాలతో కలిసి పలు ఉద్యమాలు, స‌మావేశాలు, స‌మాలోచ‌న‌లు నిర్మించిన జయప్రకాశ్ నారాయణ గ్రామస్థాయి వరకు లోక్‌సత్తాను తీసుకెళ్లగలిగారు.


ఆ తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన లోక్‌సత్తా ఘోర పరాజయం పాలైంది. ఒక్క కూకట్‌పల్లి నియోజకవర్గంలో జేపీ మాత్రమే విజయం సాధించారు. అదికూడా తన సామాజిక వర్గం, సెటిలర్లు, విద్యావంతులు మెజార్టీగా ఉన్న నియోజకవర్గాన్ని వ్యూహాత్మకంగా ఎంచుకోవడం వల్లే ఆయన విజయం సాధించగలిగారే తప్ప పార్టీ బలంతో గెలువలేదన్నది నిర్వివాదాంశం. జేపీ పార్టీ పెట్టిన సందర్భం, నేపథ్యం.. ప్రస్థానంతో పోల్చుకుంటే జేడీ తన పార్టీ ప్రకటనకు ముందు జేపీ మాదిరిగా ముందస్తు కసరత్తు చేయ‌లేద‌ని, ఏపీ ఎన్నిక‌ల‌కు కేవ‌లం నాలుగు నెల‌లు కూడా లేని స‌మ‌యంలో పార్టీ ప్ర‌క‌ట‌న చేయ‌డం హాస్యాస్ప‌దంగా మారింద‌ని అంటున్నారు.


నాడు ఎన్టీ రామారావు సినిమా హీరోగా, ప్ర‌జ‌ల‌కు రాముడిగా, కృష్ణుడుగా భారీ క్రేజ్ సాధించి ఎన్నిక‌ల ముందు పార్టీ పెట్టి స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు జేడీ పార్టీ సంస్థాగత నిర్మాణం.. బలోపేతం.. ఎన్నికల సన్నద్ధత లేకుండా పార్టీ ప్ర‌క‌టించి ఎన్టీఆర్ త‌ర‌హాలో అధికారం చేప‌ట్టే ఆలోచ‌న‌లో ఉన్నా, వాస్త‌వ ప‌రిస్థితులు ఎంత మాత్రం జేడీ పార్టీకి అనుకూలంగా లేవంటున్నారు.


మరోవైపు తెలంగాణలో మాజీ ఐపీఎస్ ఆర్‌ ప్రవీణ్‌కుమార్ స్వైరో అనే విభాగాన్ని నడిపి యువతను, విద్యార్థులను ఆకట్టుకుని తెలంగాణ బీఎస్పీ శాఖ పగ్గాలు చేపట్టి ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందే జనంలోకి వెళ్లారు. దేశ‌వ్యాప్తంగా ఎంతో కొంత గుర్తింపు ఉన్న బీఎస్పీలాంటి పార్టీలో చేరి భారీ అంచనాలతో ఎన్నికల బరిలోకి దిగిన ప్రవీణ్‌కుమార్ సైతం తెలంగాణలో 110 స్థానాలకు పైగా పోటీ చేసి క‌నీసం ఆయ‌న కూడా గెల‌వ‌లేక‌పోయారు.


నిన్న చిరు.. నేడు షర్మిల..


జేడీ కొత్త పార్టీ ప్రకటన సందర్భంలో వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ ప్రయాణం కూడా ఒకసారి మననంలోకి తీసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. దివంగత మాజీ సీఎం వైఎస్సార్ కూతురుగా ఉన్న చరిష్మా.. ఏపీ, తెలంగాణలో వేల కిలోమీటర్ల పాదయాత్రలతో అనేక గ్రామాలను చుట్టిన షర్మిల వైఎస్సార్టీపీని స్థాపించి పాదయాత్రతో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేసి, అరెస్టులకు, గృహ నిర్బంధాలకు గురయ్యారు.


కేసులను ఎదుర్కొన్నారు. ఆర్థిక స్థోమత, సామాజిక బ‌లం ఆసరాగా ష‌ర్మిల‌ పార్టీ సంస్థాగతంగా తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల్లో గ్రామస్థాయి వరకు ఎంతో కొంత విస్త‌రించింది. అలాంటి షర్మిల పార్టీనే నామమాత్రంగా మారి ప్రత్యక్ష ఎన్నికలకు వచ్చే సరికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తెరపై నుంచి తప్పుకుని కాంగ్రెస్‌లో విలీనం కోసం వేచి చూస్తోంది. పేదలు, కార్మిక సంఘాల అండ.. సైద్ధాంతిక బలమున్నా తెలంగాణలో వామపక్షాలు డిపాజిట్లు సైతం సాధించలేకపోతున్నాయి.


గతంలో మెగాస్టార్‌గా జనాకర్షణ ఉండి, ప్రజారాజ్యం పార్టీ పేరుతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన హీరో చిరంజీవి రాజకీయాల్లో జీరోగా మారి పార్టీని నడపలేక కాంగ్రెస్‌లో విలీనం చేసేసి చివరకు రాజకీయ సన్యాసం చేసేశారు. ఇక పవన్ కల్యాణ్ పదేళ్లుగా జనసేన పార్టీని నడిపిస్తూ తరుచూ ఏదో ఒక ఉద్యమంతో జనంలో హల్‌చల్ చేస్తున్నప్పటికీ రాజకీయంగా ప్రధాన పార్టీగా అవతరించలేకపోతున్న‌ది. స్వయంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు.


ఇప్పుడు సొంతంగా అధికార సాధన అసాధ్యమని అవ‌గాహ‌న‌కు వ‌చ్చి, ఎన్నికలకు ముందే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఏపీ రాజకీయాల్లో రెడ్డి, కమ్మ సామాజికవర్గాలు వైసీపీ, టీడీపీ వెంట సాగుతున్న క్రమంలో కాపు సామాజిక వర్గం అండ ఉన్నా జనసేన బలోపేతం కాలేకపోతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో జేపీ, షర్మిల, చిరంజీవి, పవన్‌, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ల రాజకీయ ప్రయాణం చూస్తే జేడీ ప్రయాణం అంతకంటే గొప్పగా ఉంటుందని చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ఏపీలో పొలిటికిల్ స్పేస్ ఎంత..?


ఏపీలో ప్రస్తుతానికి కొత్త పార్టీ ఎదగడానికి రాజకీయ ఖాళీ (గ్యాప్‌) లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జేడీ కొత్త పార్టీ మనుగడ అంత సులభం కాదంటున్నారు. అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పార్టీ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఉన్నది. ప్రధాన ప్రతిపక్షంగా ఘనమైన గత చరిత్ర ఉన్న టీడీపీ.. అనుభవజ్ఞుడైన చంద్రబాబు సారథ్యంలో తిరిగి అధికార సాధన కోసం ఊవ్విళ్లూరుతున్నది.


మరోవైపు 125 ఏళ్లకుపైగా సుదీర్ఘ చరిత్ర ఉండి, దేశాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన చరిత్ర, బూత్ స్థాయి వరకు సంస్థాగత నిర్మాణం ఉన్నజాతీయ పార్టీ కాంగ్రెస్.. రాష్ట్ర విభజన త‌రువాత‌ తిరిగి పుంజుకోవడానికి నానా తంటాలు పడుతున్నది. వైఎస్‌ షర్మిల రాకతో కొత్త జవసత్వాలు నింపుకోవాలని ఆరాటపడుతున్నది. ఇక మరో జాతీయ పార్టీ బీజేపీ సైతం బలమైన సంస్థాగత, సైద్ధాంతిక బలంతో విస్తరించి అవకాశం కుదిరితే అధికార సాధన, లేదంటే నిర్ణయాత్మక పాత్ర స్థాయికి సీట్లు పెంచుకోవాలని ఆరాట పడుతున్నది.


ఇక సినీ హీరో పవన్ కల్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీ తనకున్న నిర్ణయాత్మక ఓటు బ్యాంకుతో రాష్ట్ర రాజకీయాల్లో సత్తా చాటేందుకు సన్నద్ధమైంది. సీఎం జగన్‌ను గద్దె దించే లక్ష్యంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో జతకట్టింది. ఇక వామపక్షాలు, ఇతర పార్టీలు ఉండనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జేడీ జై భారత నేషనల్ పార్టీ వైపు చూసేందుకు ప్రజలు ఎంతమేరకు సిద్ధంగా ఉన్నారన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా ఉపన్యాసాలకే పరిమితమై కనీస సంస్థాగత నిర్మాణం కూడా లేకుండా జై భారత్ నేషనల్ పార్టీ ఏపీ రాజకీయాల్లో రానున్న ఎన్నికల్లో అధికారం సాధించడం మాటేమోగానీ కనీసం జేడీ అయినా విజయం సాధిస్తారా? అనేది అనుమానమేనని రాజకీయ విశ్లేషణకులు పేర్కొంటున్నారు.


దేశంలో ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే 6 జాతీయ పార్టీలు, 55 ప్రాంతీయ పార్టీలు, 2,597 గుర్తింపు లేని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. జేడీ కూడా పార్టీ కూడా మఖలో పుట్టి పుబ్బలో పోయినట్లుగా 2,598వ పార్టీగా మిగిలిపోక తప్పదన్న అభిప్రాయాలు అప్పుడే సోష‌ల్ మీడియాలో మొద‌లైపోయాయి. జేడీ ఆశ‌యాలు, సిద్ధాంతాలు మంచివే అయినా, ప్ర‌స్తుత ఏపీ రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో దానికి అవ‌స‌ర‌మైన వాతావ‌ర‌ణం లేద‌న్న‌ది స్ప‌ష్టం. పోలీసు అధికారిగా ఎలాంటి మ‌చ్చ‌లేకుండా డ్యూటీ చేసిన జేడీ లాంటివారు రాజ‌కీయాల్లో ఉండ‌టం క‌చ్చితంగా ప్ర‌జాస్వామ్యానికి మంచిదే అయినా, ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల్లో మార్పు తీసుకురావ‌డ‌మే ప్ర‌ధాన స‌వాలుగా మారుతోంది. జైభారత్ పార్టీ భవితవ్యంపై ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందన్నది వేచిచూడాల్సివుంది.