టీడీపీ-జనసేన కూటమిలో వామపక్షాలే మేలు

  • ఏపీకి నష్టం చేసి కాషాయపార్టీతో కూటమా?
  • పవన్‌ వ్యాఖ్యలపై పరిశీలకుల అభిప్రాయం


విధాత : ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా ఉండాలంటే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లాలనేది తన ఆకాంక్ష అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెబుతున్నారు. ఈ మూడు కలిసి పోటీ చేయాలంటే 175 స్థానాల్లో సీట్ల పంపిణీపై అనేక చిక్కుముడులు ఏర్పడవచ్చు. అంతేకాదు ఒకవేళ బీజేపీని కలుపుకొంటే.. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వామపక్షాలు ఆ కూటమికి దూరం కావొచ్చని, ఈ విషయం తెలిసి కూడా జనసేన అధినేత అలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు. పైగా చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్ర బీజేపీ పెద్దల హస్తం ఉండొచ్చని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి సహకారం లేకుండా వైసీపీ ప్రభుత్వం అంతటి సాహసం చేసి ఉండదనేది వారి వాదన.

పైగా బీజేపీకి పార్టీల కంటే తమకు ఒనగూరే ప్రయోజనమే ముఖ్యం అన్నది ఈ తొమ్మిదిన్నరేళ్ల వారి పాలనా విధానాలు, మోదీ, షాల వైఖరి చూస్తే అర్థమౌతుంది. మరో ముఖ్యమైన విషయం.. ఏపీలో బీజేపీకి పెద్దగా బలం ఏమీ లేదు. కమ్యూనిస్టులతో పోలిస్తే ఆ పార్టీ బలం ఇంకా తక్కువే. అలాంటి పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన పవన్‌ చేయడం పరోక్షంగా వైసీపీకే మేలు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

విభజన వల్ల ఏపీ నష్టపోయిందనే కోపంతోనే కాంగ్రెస్‌ పార్టీపై అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి చేయకపోవడం, కొత్త పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన రాయితీలు ఇవ్వకపోవడం వంటివి కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలుగానే ఏపీ ప్రజలు భావిస్తున్నారు. అలాంటి పార్టీని అక్కడి ప్రజలపై రుద్దాలనుకోవడం సరికాదని ప్రజలు అనుకుంటున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏపీ ప్రయోజనాలు, హక్కుల కోసం కొట్లాడే పార్టీలు కావాలని చెబుతున్నారు. ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేసే పార్టీలను కలుపుకుని పోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.



కానీ కేంద్రం ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ఏపీకి ఏం చేయకపోయినా ప్రశ్నించకుండా అక్కడి ప్రభుత్వానికి అన్నిరకాలుగా అండగా వైసీపీ ఉంటున్నది. ఇటువంటి పార్టీకి వ్యతిరేక కూటమిలో బీజేపీ ఉండగలదా? అనేది మరో సందేహం. చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే బీజేపీ వ్యవహారశైలి ఎలా ఉన్నదో ఇట్టే అర్థమౌతుంది. కాబట్టి పవన్‌ కల్యాణ్‌.. అక్కడ ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైనే కాదు, ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీనీ అంతే దూరం పెడితే బాగుంటుందనే రాజకీయ విశ్లేషకులు, ప్రజలు అనుకుంటున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన కూటమిలో కాషాయ పార్టీని కలుపుకొనే బదులు.. కమ్యూనిస్టులను భాగం చేసుకుంటేనే మేలని చెబుతున్నారు.