మరో ఉపరితల ఆవర్తనం.. వర్షాలు ఎక్కడంటే..

నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి

  • Publish Date - December 17, 2023 / 12:27 PM IST

– దక్షిణ కోస్తా, రాయలసీమకు వర్షసూచన

విధాత: నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కాగా సముద్రం నుంచి వీచిన తేమ గాలులతో అనేకచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా, ఉత్తర కోస్తాలో తక్కువగా నమోదయ్యాయి.


శనివారం కళింగపట్నంలో 17.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వర్షాల ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో అక్కడ ప్రజలు చలి తీవ్రతకు గజగజ వణుకుతున్నారు. కాగా మొన్నటి వరకు ‘మిచౌంగ్’ తుపాన్‌తో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది. తుపాన్ అనంతరం ఉష్ణగ్రతలు కూడా బాగా తగ్గి.. చలి ప్రభావం మరింత పెరిగింది. అక్కడక్కడా పొగ మంచుతో రహదారులు మూసుకుపోతున్నాయి. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు.