ఏపీలో ఓటు హ‌క్కు కోసం నాగ‌బాబు ద‌ర‌ఖాస్తు.. వైసీపీ స్పందన ఇదీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. ఈ క్ర‌మంలో ఏపీలో ఎక్క‌డ చూసిన ఎన్నిక‌ల సంద‌డి క‌నిపిస్తోంది

  • Publish Date - December 17, 2023 / 06:15 AM IST

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. ఈ క్ర‌మంలో ఏపీలో ఎక్క‌డ చూసిన ఎన్నిక‌ల సంద‌డి క‌నిపిస్తోంది. 18 ఏండ్లు నిండిన వారు కొత్త ఓటు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్నారు. కొంద‌రేమో త‌మ ఓటు ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారు. ఇక ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్న‌ కొంద‌రు నేత‌లు సైతం.. కొత్త‌గా ఓటు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్నారు. అలాంటి జాబితాలో సినీ న‌టుడు, జ‌న‌సేన నేత నాగ‌బాబు చేరారు. తాడేప‌ల్లి మండ‌లం వ‌డ్డేశ్వ‌రంలో కొత్త ఓటు కోసం ఫారం -6తో ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు నాగ‌బాబు.

దీంతో బూత్ లెవ‌ర్ ఆఫీస‌ర్‌.. వ‌డ్డేశ్వ‌రం గ్రామంలో కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకున్న వారి నివాసాల వ‌ద్ద విచార‌ణ చేశారు. అయితే నాగ‌బాబు ఇచ్చిన డోర్ నెంబ‌ర్‌లో విచార‌ణ చేయ‌గా, ఆ ఇల్లు తాళం వేసి ఉంది. దాంతో బూత్ లెవల్ ఆఫీసర్ పక్కన ఇంటి వారికి సమాచారం అందించారు. ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న నాగబాబును తమ వద్ద హాజరు కావాలని బీఎల్వో తెలిపారు.

నాగ‌బాబు కొత్త ఓటు ద‌ర‌ఖాస్తుపై వైసీపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..

ఏపీలో ఓటు హ‌క్కు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న నాగ‌బాబుపై వైసీపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అస‌లు తెలంగాణ‌లో ఆయ‌న త‌న ఓటును ర‌ద్దు చేసుకున్నారా? అని ప్ర‌శ్నించింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో నాగ‌బాబు ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఓటు వేశార‌ని వైసీపీ తెలిపింది. దానికి సంబంధించిన ఆధారాల‌ను కూడా బ‌య‌ట‌పెట్టింది. ఇప్పుడు ఏపీలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది.

ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ 168లో కొణిదెల నాగబాబు (సీరియల్‌ నెంబర్‌- 323), కొణిదెల పద్మజ (సీరియల్‌నెంబర్‌- 324), వరుణ్ తేజ్ (సీరియల్ నెంబర్ – 325) ఓటు హక్కు వినియోగించుకున్నారని వైసీపీ ఆరోపించింది. కాగా, తెలంగాణలో ఓటు ఉండగా, ఇప్పుడు ఏపీలో కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకోవడం ఏంటని మండిపడుతున్నారు.

తెలంగాణ‌లో నాగేంద్ర రావు.. ఏపీలో నాగేంద్ర బాబు..

పైగా తెలంగాణ ఎన్నికల్లో నాగేంద్రరావుగా ఓటు వేసిన జనసేన నేత ఏపీలో నాగేంద్రబాబుగా మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని కొన్ని ఆధారాలను ఆ పార్టీ పోస్ట్ చేసింది. నీతులు పక్క వాళ్లకు చెప్పడమేనా, మీరు ఏం పాటించడం లేదా అని వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాలో ప్రశ్నించారు.