– నారా లోకేశ్ కు కార్యకర్తల జయజయధ్వానాలు
– గాజువాక శివాజీనగర్ వద్ద పైలాన్ ఆవిష్కరణ
– తరలివచ్చిన టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు
– యువగళం, వస్తున్నా మీకోసం పాదయాత్రలు ఒకేచోట ముగింపు
విధాత: టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర సోమవారం దిగ్విజయంగా ముగిసింది. గాజువాక శివాజీనగర్ ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. అక్కడే పాదయాత్ర ముగింపు చిహ్నంగా నారా లోకేశ్ పైలాన్ ఆవిష్కరించారు. యువగళం ఆవిష్కృతమైన ముగింపు ఘట్టం పసుపుమయమైంది. కార్యకర్తల జయజయధ్వానాలు మిన్నంటాయి. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో పాటు నారా లోకేశ్ కుటుంబ సభ్యులు కూడా తరలిరావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
నారాలోకేశ్ తల్లి నారా భువనేశ్వరి, నందమూరి వసుంధరాదేవి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, ఉభయగోదావరి జిల్లాల సమన్వయకర్త ప్రత్తిపాటి పుల్లారావు, భరత్, మాజీమంత్రులు కొల్లు రవీంద్ర, అమర్ నాథ్ రెడ్డి, టీడీ జనార్దన్, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, మాజీ మంత్రి కొండ్రు మురళి, గాజువాక ఇన్ చార్జి పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాబు, జ్యోతుల నవీన్ తదితర ముఖ్యనేతలతో శివాజీనగర్ ప్రాంగణంలో కోలాహలం నెలకుంది.
కార్యకర్తల నినాదాలు, బాణాసంచా మోతలతో పైలాన్ ఆవిష్కరణ ప్రాంతం దద్దరిల్లింది. జై తెలుగుదేశం.. జయహో లోకేశ్ నినాదాలు మార్మోగాయి. అభిమానులు యువనేత నారా లోకేశ్ పై పూలవర్షం కురిపించారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర ముగించిన ప్రదేశంలోనే యువగళం పాదయాత్ర ముగింపు పలకడం కొసమెరుపు.