సీఎం జ‌గ‌న్ కి లోకేష్ బ‌హిరంగ‌లేఖ

గౌర‌వ‌నీయులు శ్రీ వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌రెడ్డి గారుముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌అమ‌రావ‌తి. విష‌యం :- విద్యుత్ వినియోగ‌దారుల‌కు భారంగా మారిన పెంచిన‌ చార్జీలను త‌గ్గించాలి. ట్రూఅప్ చార్జీలు త‌క్షణ‌మే ఉప‌సంహ‌రించుకోవాలి. కుప్పకూలిన విద్యుత్‌ రంగాన్ని గాడిన పెట్టాల్సిన అత్యవ‌స‌రం.- గురించి.. అయ్యా!ముఖ్యమంత్రి గారు మీరు ప్రతిప‌క్షనేత‌గా వున్నప్పుడు క‌రెంట్ చార్జీలు పూర్తిగా త‌గ్గించేస్తామ‌ని ప్రతీ స‌భ‌లో చెప్పిన విష‌యాలు ఇప్పటికీ జ‌నం చెవిలో మార్మోగుతున్నాయి. ఐదేళ్ల టిడిపి పాల‌న‌లో ఒక్కసారి కూడా చార్జీలు పెంచ‌క‌పోయినా అస‌త్యప్రచారం చేస్తూ బాదుడే బాదుడు […]

  • Publish Date - October 11, 2021 / 11:42 AM IST

గౌర‌వ‌నీయులు శ్రీ వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌రెడ్డి గారు
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌
అమ‌రావ‌తి.

విష‌యం :- విద్యుత్ వినియోగ‌దారుల‌కు భారంగా మారిన పెంచిన‌ చార్జీలను త‌గ్గించాలి. ట్రూఅప్ చార్జీలు త‌క్షణ‌మే ఉప‌సంహ‌రించుకోవాలి. కుప్పకూలిన విద్యుత్‌ రంగాన్ని గాడిన పెట్టాల్సిన అత్యవ‌స‌రం.- గురించి..

అయ్యా!
ముఖ్యమంత్రి గారు మీరు ప్రతిప‌క్షనేత‌గా వున్నప్పుడు క‌రెంట్ చార్జీలు పూర్తిగా త‌గ్గించేస్తామ‌ని ప్రతీ స‌భ‌లో చెప్పిన విష‌యాలు ఇప్పటికీ జ‌నం చెవిలో మార్మోగుతున్నాయి. ఐదేళ్ల టిడిపి పాల‌న‌లో ఒక్కసారి కూడా చార్జీలు పెంచ‌క‌పోయినా అస‌త్యప్రచారం చేస్తూ బాదుడే బాదుడు అంటూ దీర్ఘాలు తీశారు. మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ‌స్వీకారం చేసిన రోజున క‌రెంట్ చార్జీల గురించి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల‌ గురించి చేసిన ప్రవ‌చ‌నాలు మీకు మాత్రమే సాధ్యమైన అబ‌ద్ధాల‌ని స్పష్టమైంది. రెండున్నరేళ్ల మీ పాల‌న‌లో ఇప్పటివ‌ర‌కూ 6 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. 7 వ సారి కూడా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. టిడిపి ఐదేళ్ల పాల‌నలో మిగులు విద్యుత్ తో నాణ్యమైన 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా చేశాం. మీరు వ‌చ్చిన నాటి నుంచి విద్యుత్ ఏ ఒక్కరోజూ స‌క్రమంగా స‌ర‌ఫ‌రా కాలేదు. ఒకవైపు విద్యుత్ కోత‌లు-మ‌రోవైపు క‌రెంట్ బిల్లుల వాత‌లు సాధార‌ణ‌మైపోయాయి. ఆరు విడ‌త‌ల్లో పెంచిన విద్యుత్ చార్జీల భారం 11,611 కోట్లంటే ఎంత‌గా భారం మోపారో అర్థం అవుతోంది. పేద‌ల ఇంటి ప్యూజులు పీకుతామ‌ని మ‌రీ బెదిరించి వ‌సూలుచేస్తున్న క‌రెంటు బిల్లుల ఆదాయం చాల‌క.. ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ద్వారా 26,261 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. ఈ భారాల‌న్నీ మ‌ళ్లీ విద్యుత్ వినియోగ‌దారుల‌పై ట్రూఅప్‌ ఛార్జీలు పేరుతో బాదేందుకు రంగం సిద్ధం చేయ‌డం చాలా అన్యాయం. మా క‌రెంటు చార్జీల‌ బాదుడు ఆపం…మీరే సాయంత్రం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కూ ఏసీలు ఆపేయాలంటూ మీ అధికారుల‌తో సుద్దులు చెప్పిస్తున్నారు. నిరుపేద‌ల ఇంట్లో ఫ్యాన్‌కే గ‌తి లేక‌పోతే, ఏసీలు ఎక్కడి నుంచి వ‌స్తాయి? ముఖ్యమంత్రి గారూ! ఒక బ‌ల్బు, ట్యూబ్‌లైట్‌, ఫ్యాన్ ఉంటేనే వంద‌ల నుంచి వేల‌ల్లో బిల్లు వ‌స్తుంటే.. దీనిపై మాత్రం అధికారుల నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ వివ‌ర‌ణ లేదు. దేశవ్యాప్తంగా విద్యుత్ యూనిట్‌ ధర రూ.3.12లకే లభిస్తుంటే, మీరు యూనిట్ గ‌రిష్టంగా 20 రూపాయ‌ల‌కు ఎందుకు కొనుగోలు చేస్తున్నారో ప్రజ‌ల‌కు స‌మాధానం చెప్పాలి. యూనిట్‌కి అద‌నంగా పెడుతున్న 16 రూపాయ‌ల‌కు పైగా వస్తున్న సొమ్ము ఎవ‌రి జేబుల్లోకి వెళుతోంది? అంతులేని మీ అవినీతిని త‌గ్గించుకుంటే పేద‌ల‌కు నాణ్యమైన విద్యుత్‌ని క‌రెంటు చార్జీలు పెంచ‌కుండానే అంద‌జేయొచ్చు. క‌రోనా క‌ష్టాలు, పెరిగిన ధ‌ర‌ల‌తో బ‌తుకు దుర్భర‌మైన సామాన్యుల‌కు మీ క‌రెంట్ చార్జీల దోపిడీ శ‌రాఘాతంలా త‌గులుతోంది. రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు చెల్లించాల్సిన 12 వేల కోట్లు, ప్రభుత్వరంగ సంస్థలు చెల్లించాల్సిన 10,800 కోట్లు చెల్లిస్తే విద్యుత్ రంగం కుప్పకూలే దుస్థితి వ‌చ్చేది కాదు. వెంట‌నే ప్రభుత్వం బ‌కాయిలు చెల్లించేలా చ‌ర్యలు తీసుకుని సంక్షోభంలో ప‌డిన విద్యుత్‌రంగాన్ని కాపాడాలి. ఇప్పటికే పెంచిన విద్యుత్ చార్జీల‌ను త‌గ్గించాలి. ట్రూఅప్ చార్జీల పేరుతో మ‌రోసారి క‌రెంటు చార్జీలు పెంచే ప్రయ‌త్నాన్ని త‌క్షణ‌మే విర‌మించాలి.

ఇట్లు
నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి.