నెల్లూరు జిల్లాలోని సంగం మండలం పెరమన వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఇసుక టిప్పర్ రాంగ్ రూట్ లో వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణీస్తున్న ఏడుగురు చనిపోయారు. మరణించిన వారిలో నలుగురు పురుషులు , ఇద్దరు మహిళలు, ఓ పాప ఉన్నారు. నెల్లూరు నుంచి కడప వైపు కారు వెళ్తోంది. కారు పెరమన వద్దకు చేరుకున్న సమయంలో రాంగ్ రూట్ లో అతివేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ కారును ఢీకొట్టి రోడ్డుపై కొంతదూరం తీసుకెళ్లింది. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ముత్తుకూరు గేటు సమీపంలో గుర్రంవారివీధికి చెందినవారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతి వేగం. దీనికి తోడు మద్యం తాగి వాహనాలు నడపడం. దూరం తగ్గుతుందని రాంగ్ రూట్ లో వాహనాలు నడపడం వంటివి కూడా ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయని అధికారులు చెబుతున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, సరైన నిద్ర లేకుండా వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు కారణమని అధ్యయనాల్లో తేలింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణంగా మారుతోంది. ఇసుక వాహనాలు నడిపే డ్రైవర్లు అతి తక్కువ సమయంలో ఎక్కువ ట్రిప్పులు ఇసుక రవాణా చేయాలనే వేగంగా వాహనాలు నడుపుతుంటారు. దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.