Ukraine Vs Russia war : ఉక్రెయిన్-రష్యా (Ukraine Vs Russia) దేశాల మధ్య గత 819 రోజులుగా యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే ఇరు దేశాల్లో లక్షల సంఖ్యలో సైనికులు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఎవరూ వెనుకడుగు వేయడం లేదు. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
బఫర్ జోన్ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఉధృతం చేసింది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్ లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడింది. ‘గురువారం ఉదయం రష్యా భారీ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో మా దేశానికి చెందిన ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి’ అని ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా స్పందించారు.
రష్యాది అతి కిరాతకమైన చర్యగా జెలన్‌స్కీ అభివర్ణించారు. గత రెండేళ్లకుపైగా అలుపెరుగని యుద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పాశ్చాత్య భాగస్వామ్య దేశాల నుంచి తమకు తగిన సహకారం లభించడం లేదని నిరాశ వ్యక్తంచేశారు. రష్యా వైమానిక దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తగినన్ని రక్షణ వ్యవస్థలను సమకూర్చడంపై భాగస్వామ్య దేశాలు దృష్టి సారించడం లేదని అన్నారు.