విధాత: రానున్న అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. ఒక్కో విభాగాన్నీ బలోపేతం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాని మరింత ప్రభావవంతంగా వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నారు. యూత్ అంతా స్మార్ట్ ఫోన్లు..ల్యాప్ టాప్‌లు వాడుతున్న ఈరోజుల్లో సోషల్ మీడియాకు ఎంతటి ప్రాధాన్యం ఉందో అందరికి తెలిసిందే..
దానికితోడు గత ఎన్నికల్లో సోషల్ మీడియా ఎంతటి ప్రభావం చూపిందో.. ఓటర్లను ఎలా దారిలోకి తేగలిగిందో జగన్ ప్రత్యక్షంగా చూశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వీరి సేవలను మరింత మెరుగ్గా వినియోగించుకుని టీడీపీ మీద డిజిటల్ దాడి చేసేందుకు అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో వాడుకుని మళ్లీ ఏపీలో జెండా ఎగరేయాలన్న ఆలోచనతో జగన్ ఉన్నారు.
అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లు సోషల్ మీడియాను పట్టించుకోని జగన్ ఈమధ్యనే ఒక్కో జిల్లాకు ఒక కన్వీనర్.. నలుగురు కో కన్వీనర్లతో ప్రత్యేక టీమును సిద్ధం చేశారు. ఇంకా వాళ్ళతో ఈమధ్యనే సజ్జల రామకృష్ణరెడ్డి కూడా మాట్లాడి వారికి ప్రోత్సాహం అందించారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా స్టేట్ హెడ్‌గా సజ్జల భార్గవ రెడ్డిని జగన్ నియమించారు. వాస్తవానికి నిన్నటి వరకూ సోషల్ మీడియా విభాగాన్ని విజయసాయిరెడ్డి చూసేవారు. అయితే ఇపుడు ఆయన స్థానాన్ని భార్గవ రెడ్డికి అప్పగించారు. ఈమధ్యనే ముఖ్యమంత్రి జగన్ పార్టీకి చెందిన ముఖ్యులతో ఆంతరంగిక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలోనే సోషల్ మీడియా బాధ్యతలను కొత్త నేతకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ఐప్యాక్ ప్రతినిధి రిషిరాజ్. ఆయన బృందం సోషల్ మీడియాకు చెందిన కో ఆర్డినేటర్లు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ అమలు చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికపుడు ప్రజలలో ఉంచాలని అలాగే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను కూడా ధీటుగా తిప్పికొట్టాలని జగన్ సూచించినట్లుగా తెలిసింది.
అలాగే వైసీపీ జనాల్లోకి చొచ్చుకుపోవడానికి వారి మెదళ్ళకు చేరడానికి బలమైన కంటెంట్‌ని తయారు చేయాలని అది సోషల్ మీడియాలో ప్రభావవంతంగా సర్క్యులేట్ చేయాలని, జగన్ సూచించినట్లుగా చెబుతున్నారు. దీనికోసం ఓ కొత్త టీముతో ముందుకు వెళ్లే లక్ష్యంతో కొత్త బాస్ ను నియమించారని సమాచారం. కొత్త రౌతు సారథ్యంలో సోషల్ మీడియా ఎలా దౌడు తీస్తుందో చూడాలి.