మొత్తం భరించలేని వారికి ఉచితంగా పేదలకు రెడ్ క్రాస్ సొసైటీ సరఫరా
విధాత,అమరావతి: ప్రస్తుత కరోనా సమయంలో ప్రజలకు అవసరమైన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను సరఫరా చేసేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) సిద్ధమైంది. ఇంటి వద్దే వీటిని వినియోగించుకునేందుకు వీలుగా సరఫరా చేయనున్నారు. ఐఆర్‌సీఎస్ జీవితకాల సభ్యత్వం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. అవసరమైన వారు వైద్యుడి సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇంటి వద్ద వినియోగించుకునేలా ధ్రువీకరణ అవసరం.
రోగి, సహాయకుని ఆధార్ కార్డు జిరాక్సు రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచిలో సమర్పించాలి. కేవలం వారం రోజులకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ అందిస్తారు. ఒకవేళ వారానికి మించి అవసరం వస్తే అందుబాటులో ఉన్న ఆక్సిజన్ నిల్వలను బట్టి సరఫరా చేస్తారు. వారానికి సాధారణ సర్వీసు ఛార్జి కింద రూ.1,000 వసూలు చేస్తారు. కంప్రెషన్ నిర్వహణ, ఫిల్టర్లు మార్చడం తదితర ఖర్చుల కోసమే ఈ మొత్తం వసూలు చేస్తున్నారు.
ఒకవేళ ఎవరైనా పేదలు కనీస ఛార్జి రూ.1,000 కూడా భరించలేని పరిస్థితుల్లో ఆ మొత్తమూ తీసుకోకుండా ఇచ్చే అధికారం ఐఆర్‌సీఎస్ జిల్లా బ్రాంచికి ఉంటుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పేరు మీద సెక్యూరిటీ నిమిత్తం బ్యాంకు చెక్కును ఇవ్వాల్సి ఉంటుంది. కాన్సన్‌ట్రేటర్ తిరిగి ఇచ్చిన తర్వాత ఆ చెక్కును ఇచ్చేస్తారు. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ రవాణా ఛార్జీలు రోగి, సహాయకులే భరించాలి. పూర్తి వివరాలకు రెడ్ క్రాస్ సొసైటీ టోల్ ఫ్రీ నంబరు 1800-425-1234లో సంప్రదించవచ్చని తెలిపారు.