విధాత: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులని, కర్నూలు జిల్లాలోని ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు. స్మారక చిహ్నం కోసం రూ.కోటితో నిధి ఏర్పాటు చేస్తామన్నారు. దామోదరం సంజీవయ్య సేవలకు గుర్తుగా చిహ్నం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ ఇంటి ఫొటోలను పవన్ పోస్ట్ చేశారు.
సంజీవయ్య అత్యంత పేదరికంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగారన్నారు. వెనుకబాటుతనాన్ని రూపు మాపేందుకు బీజాలు వేశారని, సీఎంగా రెండేళ్లే ఉన్నా ఎన్నో పనులు చేశారని చెప్పారు. హైదరాబాద్ పరిసరాల్లో 6లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేశారన్నారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు ప్రారంభించింది సంజీవయ్యేనని చెప్పారు. బోయలు, కాపు కులాలను బీసీల్లో చేర్చారని పవన్ గుర్తు చేశారు