విధాత:అమరావతి : రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అమరావతి ఉద్యమానికి నేటితో 600 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునిచ్చారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో హైకోర్టు నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉద్యమకారులు చేపట్టనున్న ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అమరావతి ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డు ఉన్న స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. రాజధాని గ్రామాల్లోకి మీడియాను కూడా అనుమతించడం లేదు. పెదపరిమి వద్దే మీడియా ప్రతినిధుల వాహనాలను నిలిపివేశారు. మీడియాకు పోలీసులు సహకరించాలని ఎస్పీ విశాల్ గున్నీ కోరారు.
మరోవైపు విజయవాడ- అమరావతి మార్గంలోనూ అడుగడుగునా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ సహా కరకట్ట వెంట పోలీసులు మోహరించారు. కరకట్టపై 4 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. వాహనాలను పూర్తిగా తనిఖీ చేశాకే విడిచిపెడుతున్నారు. పలు చోట్ల నిరసనలకు దిగిన అమరావతి ఉద్యమకారులు, తెదేపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. తాడేపల్లిలో పలువురు తెదేపా కార్యకర్తలను అరెస్ట్ చేశారు.