Road accident | ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. మంటల్లో ఆరుగురు సజీవ దహనం

చిలకలూరిపేట పర్చూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో చెలరేగిన మంటలలో ఆరుగురు సజీవ దహనమయ్యారు బస్సులోని 32 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి

  • Publish Date - May 15, 2024 / 08:41 AM IST

20మందికి గాయాలు

విధాత: స్వగ్రామంలో ఓటు వేసేందుకు కుటుంబాలతో కలిసి వెళ్లిన వారిని తిరుగు ప్రయాణంలో మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. హైదరాబాద్ నుంచి ఓటేసేందుకు వెళ్లి తిరిగి ఉద్యోగ విధుల కోసం తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సును టిప్పర్ ఢీ కొట్టడంతో చెలరేగిన మంటల్లో బస్సు దగ్ధమైపోగా మంటల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు చిన్నారి, బస్సు , టిప్పర్ డ్రైవర్లు ఉన్నారు.

స్థానికులు, క్షతగాత్రుల వివరాల మేరకు బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు చేరుకున్న క్రమంలో ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్.. బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌లో మంటలు రేగి.. బస్సుకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమవ్వగా.. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మృతుల్లో బస్సు డ్రైవర్ అంజి, మధ్యప్రదేశ్ కు చెందిన టిప్పర్ డ్రైవర్ హరిసింగ్, నీలాయపాలెం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని కాశీ బ్రహ్మేశ్వరరావు(62), లక్ష్మి(58), శ్రీసాయి (8) ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు చాలమంది నిద్ర మత్తులో ఉన్నారు. వారు కళ్లు తెరిచేలోపే అగ్నికీలలు బస్సును ఆవరించి వారిని చుట్టుముట్టాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటగా స్థానికులు అప్రమత్తమై.. 108, పోలీసులకు సమాచారం చేరవేశారు.

పలువురు ప్రయాణికులు డ్రైవర్ డోర్ నుంచి, మరికొందరు కిటికిల నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రమాదంలో 20మంది గాయపడగా వారికి చిలకలూరిపేట, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చిలకలూరిపేట ఆసుపత్రిలో పరామర్శించారు.

Latest News