కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సీఎస్ నిర్ణయం
విధాత: ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్‌ను వేయనుంది. ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి సిట్ అధికారుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఐజీ, డీఐఈ స్థాయికి చెందిన ముగ్గురు అధికారులతో సిట్ ఏర్పాటు చేయనున్నారు. రవిప్రకాశ్, వినీత్ బ్రెజిలాల్, పీహెచ్.రామకృష్ణ పేర్లను సీఎస్ పరిశీలనలో ఉన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటనపైనా సిట్ నివేదిక ఇవ్వనుంది. పల్నాడు. మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై సిట్ విచారణ జరపనుంది.
తాజాగా విశాఖలో జరిగిన ఘటననూ సిట్ పరిధిలోకి తెచ్చే అంశంపైనా అధికారులు ఆలోచన చేస్తున్నారు. తాడిపత్రి ఘటనలో డీఎస్పీ చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం ఉంది. ప్రతి ఘటనపైనా పోలీసులు ఎస్ఐఆర్ నమోదు చేయనున్నారు. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించింది. వివిధ ఘటనల్లో పోలీసు అధికారుల వైఫల్యం కనిపించడంతో ఇప్పటికే ఈసీ పలువురు అధికారులపై వేటు వేసింది.
వారిపై చార్జ్‌షీట్
ఎన్నికల ఘర్షణలకు ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్‌ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై మేరకు వారిపై చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్డర్‌లను సస్పెండ్ చేసిన ఈసీ.. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, పల్నాడు కలెక్టర్ లోతేటి శివశంకర్లపై బదిలీ వేటు వేసింది. ఈ మూడు జిల్లాలకు చెందిన 12 మంది కిందిస్థాయి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ 16 మందిపైనా శాఖాపరమైన విచారణ జరిపించాలని ఆదేశించింది. వారిపై చార్జిషీట్ వేయాలని స్పష్టం చేయడంతో అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అలాగే వారిపై శాఖాపరమైన విచారణకు కూడా ఈసీ ఆదేశించింది. 60 రోజుల్లోగా విచారణ పూర్తిచేసి.. తదుపరి చర్యల కోసం సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని సూచించింది. తమ ఆమోదం లేకుండా సస్పెన్షన్ ఎత్తివేయకూడదని, శాఖాపరమైన చర్యలు నిలిపివేయకూడదని పేర్కొంది. వారి స్థానంలో సమర్ధులైన కొత్త అధికారులను నియమించాలని ఆదేశించింది.
మళ్లీ అల్లర్లకు అవకాశం..జూన్ 19 వరకు కేంద్ర బలగాలు అక్కడే
ఏపీలో ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘర్షణలు నివురు గప్పిన నిప్పుల ఉండటం..పలుచోట్ల ఇంకా 144సెక్షన్ కొనసాగుతుండటం..మళ్లీ ఘర్షణలు తలెత్తే అవకాశముందన్న ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో జూన్ 19వరకు కేంద్ర బలగాలు అక్కడే ఉండాలని ఈసీ కేంద్ర హోంశాఖను ఆదేశించింది.
జూన్ 4న ఫలితాల అనంతరం హింస చెలరేగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో ఉన్న 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను.. ఫలితాలు వెలువడిన తర్వాత 2 వారాల వరకు కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఏపీలో మళ్లీ అల్లర్లు చెలరేగవచ్చన్న కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం చేసిన హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 19వ తేదీ వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని ఈసీ సూచించింది.