విధాత,అమరావతి: రెండేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రతి కుటుంబాన్ని, ప్రాంతాన్ని, సామాజిక వర్గాన్నీ దృష్టిలో ఉంచుకుని అడుగులు ముందుకు వేశామని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేశామని చెప్పారు. బడ్జెట్ సమావేశంలో భాగంగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో కొవిడ్ బారిన పడి మృతిచెందిన వారికి శాసనసభ సంతాపం తెలిపింది. సీఎం సహా సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా జగన్ వివరించారు.
ఆరోగ్యశ్రీలో సమూల మార్పులు తీసుకొచ్చాం
‘‘ప్రాణం విలువ నాకు బాగా తెలుసు. అందుకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీలో సమూల మార్పులు తీసుకొచ్చాం. ప్రాణం పోసే పథకంగా ఉండాలనే ఉద్దేశంతో రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న ప్రతి కుటుంబానికీ ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు చేపట్టాం. 2019కి ముందు 1000 జబ్బులకు మాత్రమే అందులో అవకాశముండేది. ఇప్పుడు 2400 వ్యాధులను చేర్చాం. దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా 104, 108 వాహనాలను వైద్యపరికరాలతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏఎన్‌ఎంను కూడా నియమించాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ అందుబాటులోకి రానున్నాయి. అందులోనే 90 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు.. ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
18వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల కొనుగోలు
ప్రపంచానికి కొవిడ్ పెద్ద సవాలు విసురుతోంది. రాష్ట్రంలో గత ఏడాది మార్చిలో తొలి కేసు నమోదైంది. గతంలో కరోనా పరీక్షల ఫలితాలకు నమూనాలను పుణె పంపాల్సి వచ్చేది. ఇప్పుడు రాష్ట్రంలో 150కి పైగా ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. రాష్ట్రంలో రోజూ లక్షకు పైగా పరీక్షలు చేస్తున్నాం. కొవిడ్ ఫస్ట్ వేవ్‌లో 261 ఆస్పత్రుల్లో.. ఇప్పుడు 649 ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి మహానగరం లేకుండా పోయింది. దీంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కూడా కరవయ్యాయి. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను గ్రహించి వైద్య రంగాన్ని పటిష్ఠం చేసేందుకు చర్యలు చేపట్టాం. ‘నాడు- నేడు’ కింద ఆస్పత్రుల అభివృద్ధికి చర్యలు చేపట్టాం.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టీచింగ్, నర్సింగ్ కళాశాల పెట్టే ఆలోచన ఉంది. గత సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో కరోనా రోగుల కోసం 37,400 బెడ్లు ఉంటే.. ఇప్పుడు 47,285 బెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చాం. కొవిడ్ కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం. అక్కడ కూడా మెరుగైన వైద్య సేవలు అందేలా అందులో 52వేల పైచిలుకు బెడ్లు అందుబాటులో ఉంచాం. కొవిడ్ కేర్ సెంటర్లలో 18 వేలకుపైగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు కొనుగోలుకు చర్యలు చేపట్టాం. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి ఉచితంగా వైద్యం అందిస్తున్న రాష్ట్రం ఏపీనే. రోజూ సుమారు 25వేల మంది ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సదుపాయాలు పొందుతున్నారు. కేవలం కొవిడ్‌పైనే ఈ 14 నెలల్లో రూ.2,229 కోట్లు ఖర్చు చేశాం. కొత్తగా బ్లాక్ ఫంగస్‌ను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఈ వ్యాధి చికిత్స కోసం రాష్ట్రంలో 17 ఆస్పత్రులను నోటిఫై చేశాం.
వాళ్లందరికీ హ్యాట్సాఫ్
104కు ఫోన్ చేస్తే కొవిడ్‌కు సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేలా చర్యలు చేపట్టాం. ఈనెల 16 నాటికి 104 కాల్ సెంటర్‌కు 3లక్షలకు పైగా కాల్స్ వచ్చాయి. వీరిలో 60,634 మందికి ఆస్పత్రుల్లో అడ్మిషన్లు ఇప్పించగలిగాం. కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి తగు సూచనలు చేస్తున్నాం. 3,991 మంది వైద్యులు టెలీ మెడిసన్ ద్వారా సేవలు అందిస్తున్నారు.
జిల్లాల్లో ఆక్సిజన్ మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేశాం. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే స్పందించేలా చర్యలు చేపట్టాం. రోజుకి 4 నుంచి 6 ఖాళీ ట్యాంకర్లను విమానాల్లో ఒడిశా పంపి ఆక్సిజన్ తెస్తున్నాం. విదేశాల నుంచి క్రయోజెనిక్ ట్యాంకర్లు, ఆక్సిజన్‌ను షిప్‌లలో దిగుమతి చేసుకుంటున్నాం. ఆక్సిజన్ ఎక్కడ లభిస్తున్నా తెప్పించేందుకు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాం. రాబోయే తరాలకు మంచి జరగాలనే ఉద్దేశంతో సీహెచ్‌సీ స్థాయి వరకు 53 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం. గ్రామ స్థాయిలో ఉన్న ఆశా వర్కర్ల నుంచి డాక్టర్లు, శానిటేషన్ సిబ్బంది మొదలుకొని కలెక్టర్ల వరకు కష్టపడి పనిచేస్తున్నారు. అందుకే మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉంది. వాళ్లందరికీ హ్యాట్సాఫ్.
వాస్తవాలు తెలిసీ నిందలు
రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారు 1.48 కోట్ల మంది ఉన్నారు. వాళ్లకి వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే 3 కోట్ల డోసులు అవసరం. 18-45 ఏళ్లలోపు ఉన్న 2 కోట్ల మందికి 4 కోట్ల డోసులు కావాలి. ఈ లెక్కన రాష్ట్రానికి మొత్తం 7 కోట్ల డోసులు అవసరముంది. కానీ ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చింది 76.29లక్షల డోసులు మాత్రమే. ఈ వాస్తవాలు తెలిసి కూడా కొందరు కావాలనే రాజకీయ నిందలు వేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. కమీషన్ల కోసం వ్యాక్సిన్ కొనడం లేదంటూ దుర్మార్గ ఆరోపణలు చేస్తున్నారు. ఇవి చూసినపుడు మనసుకు బాధ అనిపిస్తోంది. వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్ టెండర్లకు వెళ్తున్నాం.
రాష్ట్ర జనాభాలో సుమారు 11 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ అయింది. 50 శాతం పూర్తిచేయగలిగితే కొద్దో గొప్పో హెర్డ్ ఇమ్యూనిటీ కనిపిస్తుంది. కొవిడ్ నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషనే పరిష్కారం. అంతవరకు కరోనాతో కలిసి బతకాలనే నిజాన్ని అర్థం చేసుకోవాలి. 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ వేసేందుకు తొలి ప్రాధాన్యమిస్తాం. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మిగిలిన వారికీ ఉచితంగా వేస్తాం. ఆదాయం తగ్గుతున్నా ప్రాణం విలువ తెలుసు కాబట్టే తప్పులు జరిగే అవకాశం లేకుండా చిత్తశుద్ధితో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల మనోధైర్యం దెబ్బతీసేలా అసత్యాలు, అపోహల ప్రచారం చేయొద్దు. ప్రజల్లో భయాన్ని పుట్టించి ఆడే గుండెనూ ఆపేయకండి’’ అని జగన్ కోరారు.