వైసీపీని వణికిస్తున్న రాజీనామాల జాబితా

వైసీపీ అధిష్టానం వచ్చే శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఇప్పటికే తీవ్ర కసరత్తు చేపట్టింది. నియోజకవర్గాల వారీగా ఆపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు

  • Publish Date - January 24, 2024 / 01:50 PM IST

– వరుసగా క్యూకడుతున్న అసంతృప్త నేతలు

– జగన్ ప్రకటిస్తున్న అభ్యర్థుల జాబితాకు పోటీగా రాజీనామా లేఖలు

– గ్రామస్థాయిలోనూ క్యాడర్ లో అంతర్గత పోరు

– ఎన్నికల వేళ సీఎం జగన్ అతలాకుతలం

విధాత: వైసీపీ అధిష్టానం వచ్చే శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఇప్పటికే తీవ్ర కసరత్తు చేపట్టింది. నియోజకవర్గాల వారీగా ఆపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో భేటీలు ఏర్పాటు చేసి.. వరుస జాబితాలు వెల్లడించింది. ఇప్పటికే నాలుగు జాబితాలతో కూడిన అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సీఎం జగన్.. త్వరలో ఐదో జాబితాను విడుదల చేయనున్నారు. పలు నియోజకవర్గాల్లో సిటింగ్ ల మార్పులు, చేర్పులతో ఇన్ చార్జిలను నియమించడం, పలుచోట్ల అనూహ్యంగా కొత్త అభ్యర్థులు తెరపైకి రావడంతో ఆపార్టీలో నేతల మధ్య తీవ్ర ఆసంతృప్తికి ఆజ్యం పోసినట్లయ్యింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల కంటే ముందస్తుగానే వైసీపీ అధిష్టానం అభ్యర్థులను ఇన్ చార్జిల రూపంలో నియోజకవర్గాలకు పరిచయం చేస్తోంది. ఆమేరకు నిర్ణయించిన అభ్యర్థులు ఇప్పటికే పార్టీ శ్రేణులతో మమేకమవుతూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. టికెట్లు దక్కని నేతలు అధిష్టానంపై తిరగబడుతున్నారు. ఏకంగా రాజీనామాలు సమర్పించి.. సీఎం జగన్ తీరుపై మండిపడుతున్నారు. ఈక్రమంలో ఇప్పటికే కర్నూలు ఎంపీ సంజీవ కుమార్, నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్సీలు సీ రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. వీరితో పాటు పలువురు ముఖ్య నాయకులు కూడా రాజీనామాలు సమర్పించారు. దిగువ స్థాయి నేతలు వందల సంఖ్యలో పార్టీకి దూరమయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా రాజీనామా చేసేందుకు వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రామస్థాయిలో వైసీపీ క్యాడర్ అంతర్గత పోరులో అతలాకుతలమవుతోంది. ఈపరిస్థితుల్లో ఎన్నికల్లో నెగ్గుకురావడం సీఎం జగన్ కు పరీక్షగా మారనుంది.

– కలకలం రేపుతున్న బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు

తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. రాజ్యసభ ఎన్నికలపై మీడియా వేదికగా స్పందించిన బుచ్చయ్య.. రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ ఎమ్మెల్యేలే మమ్మల్ని అడుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. అభ్యర్థిని నిలబెడితే టీడీపీకి ఓటేసి గెలిపిస్తామని సుమారు 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రాజీనామాను మూడేళ్ల తర్వాత స్పీకర్ ఆమోదించడం వెనుక కూడా.. వైసీపీ రాజ్యసభ ఎన్నికలకు భయపడుతోందని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామం నిజమైతే సాధారణ ఎన్నికలకు ముందు అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

– నంద్యాలలో లోకల్.. నాన్ లోకల్ కుమ్ములాట

నంద్యాల వైసీపీలో లోకల్.. నాన్ లోకల్ కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. సిటింగ్ ఎమ్మెల్యే శిల్పా రవికి, జడ్పీటీసీ గోకుల్ క్రిష్ణారెడ్డి మధ్య ఆధిపత్య పోరు రగులుకుంటూనే ఉంది. శిల్పా రవి స్థానికేతరుడు అంటూ క్రిష్ణారెడ్డి ఎన్నికల ముందు కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. అంతటితో ఆగక ‘ఆత్మగౌరవ ఓదార్పు యాత్ర’ చేపట్టి.. సిటింగ్ ఎమ్మెల్యేపై విరుచుకు పడుతున్నారు. దీంతో రగిలిన శిల్పా రవి పోలీసులను అడ్డుపెట్టి యాత్రకు బ్రేక్ వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా గోకుల్ క్రిష్ణారెడ్డి నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఈక్రమంలోనే జనాల్లోకి వెళుతూ.. సిటింగ్ ఎమ్మెల్యేపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇకపై నంద్యాలకు స్థానిక నాయకులు కావాలా? స్థానికేతరులు కావాలో తేల్చుకోవాలంటూ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతుండడంతో.. ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు భగ్గుమంటోంది. ఇరువురి మధ్యా వివాదం రోజురోజుకూ ముదురుతూ పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది.

బుజ్జగింపులు ఫలించేనా?

వైసీపీని వీడేందుకు అసంతృప్త నేతలు క్యూ కడుతుండగా.. మరోవైపు సీఎం జగన్ అలర్ట్ అవుతున్నారు. పార్టీ సీనియర్లను రంగంలోకి దింపి ఆయా ప్రాంతాల నేతలతో సంప్రదింపులు చేపడుతున్నారు. బుజ్జగింపులతో నేతలు వెనక్కు తగ్గేరా? అన్నది చర్చగా మారింది. తాజాగా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబును సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఈస్థానాన్ని మంత్రి మేరుగ నాగార్జునకు కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో సుధాకర్ బాబు అలకబూనారు. పార్టీకి దూరమయ్యే సంకేతాలు రావడంతో అధిష్టానం అప్రమత్తమైంది. ఈక్రమంలో సీఎంవోకు వచ్చిన సుధాకర్ బాబులో సీఎం జగన్ చర్చలు ఎంతవరకు ఫలిస్తాయన్నది వేచిచూడాలి. ఇదే పంథాలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో రగులుతున్న అసంతృప్తులకు అడ్డుకట్ట వేసేందుకు సీఎం జగన్ నేరుగా చర్చలు జరిపే అవకాశాలుఉన్నట్లు తెలుస్తోంది.