Site icon vidhaatha

Kethi Reddy Pedda Reddy : తాడిపత్రి వెళ్లేందుకు.. పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Kethi reddy Pedda Reddy

Kethi Reddy Pedda Reddy | అమరావతి : ఎట్టకేలకు తన సొంత నియోజకవర్గం తాడిపత్రి వెళ్లేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మార్గం సుగమమైంది. తనను తాడిపత్రికి వెళ్లకుండా రాజకీయ కక్షల నేపధ్యంలో టీడీపీ ప్రభుత్వం, పోలీసులు అడ్డుకుంటున్నారంటూ పెద్దారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పెద్దారెడ్డి వేసిన పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. మీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారు? అంటూ పెద్దారెడ్డిని ప్రశ్నించింది. తన సొంత నియోజకవర్గంలోకి వెళ్లకుండా.. ఒక వ్యక్తిని ఎలా ఆపగలరంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి నిరభ్యంతరంగా వెళ్లొచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గతంలో ఆయన తాడిపత్రి ప్రవేశంపై ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అవసరమైన భద్రత కల్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఒకవేళ అవసరమైతే ప్రైవేట్‌ సెక్యూరిటీ కూడా పెట్టుకోవచ్చని పెద్దారెడ్డికి కోర్టు సూచించింది. ఈ క్రమంలో పోలీసు సెక్యూరిటీకి అవసరమైన ఖర్చు భరించేందుకు పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు అంగీకరించారు. తాడిపత్రికి వెళ్లే సమయంలో పెద్దారెడ్డికి పోలీసు భద్రత కూడా కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

14 నెలలుగా నియోజవర్గానికి దూరం

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలింగ్‌ తర్వాత తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి టీడీపీ జెండా ఎగరేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అంటే దాదాపు 14 నెలలుగా ఆయన తాడిపత్రిలో అడుగుపెట్టలేకపోతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒత్తిడి వల్ల పోలీసులు నన్ను తాడిపత్రిలోకి అనుమతించడం లేదని పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. పలుమార్లు పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పెద్దారెడ్డికి షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చినప్పటికి పోలీసులు ఆ ఉత్తర్వులను అమలు చేయలేదు. దీంతో ఆయన కోర్టు ధిక్కార పిటిషన్ వేయగా..పోలీసులు శాంతిభద్రతల సమస్యగా ఇచ్చిన వివరణతో హైకోర్టు పెద్దారెడ్డి తాడిపత్రి అనుమతిని రద్దు చేసి విచారణ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా అనుమతి లభించింది. సుప్రీం కోర్టు తీర్పుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో న్యాయం గెలిచిందని.. సుప్రీంకోర్టు తీర్పు కాపీలను ఎస్పీకిఅందజేస్తానని.. త్వరలో తాడిపత్రి వెళ్తానని తెలిపారు. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని వారికి సేవ చేస్తానని. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు పోలీసులకు సహకరిస్తాను అని పెద్దారెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version