అక్రమ మైనింగ్ నిరోధానికి జిల్లా కమిటీలు.. ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం కీలక ఆదేశాలు

ఏపీలో ఇసుక తవ్వకాలపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఇసుక అక్రమ మైనింగ్‌పై జస్టిస్ అభయ్, జస్టిస్ ఉజ్జల్ భూయన్ ధర్మాసనం విచారణ చేపట్టింది

  • Publish Date - May 16, 2024 / 05:50 PM IST

విధాత : ఏపీలో ఇసుక తవ్వకాలపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఇసుక అక్రమ మైనింగ్‌పై జస్టిస్ అభయ్, జస్టిస్ ఉజ్జల్ భూయన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అక్రమ మైనింగ్ నిరోధానికి ప్రతి జిల్లాలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కలెక్టర్, పోలీసులు, అధికారులు ఈ కమిటీలో ఉండాలని పేర్కోంది. అక్రమ మైనింగ్ ఆపడానికి చర్యలు తీసుకోవాలని, అలాగే కమిటీ రెగ్యులర్‌గా మైనింగ్ ప్రాంతాలు సందర్శించాలని, ప్రతి జిల్లాలో ఈ కమిటీ ఉండాలని స్పష్టం చేసింది.

మరోవైపు.. “గ్రీవెన్స్ సెల్” ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరణకు “టోల్ ఫ్రీ” నెంబర్, ఈ మెయిల్ ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా కమిటీ పని చేయాలని.. “టోల్ ఫ్రీ” నెంబర్, ఈ మెయిల్ గురించి విస్తృత పబ్లిసిటీ ఇవ్వాలని పేర్కొంది. ఆదేశాలు అమలు చేయకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరింది. ఇసుక అక్రమ మైనింగ్ ప్రాంతాల్లో జిల్లా కమిటీ వెంటనే తనిఖీ చేసి నాలుగు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర అధికారులు గుర్తించిన మైనింగ్‌ ప్రదేశాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసి ఎన్జీటీకి సహకరించాలని స్పష్టం చేసింది. జూన్‌ 9లోపు ఆదేశాల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్‌ సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జులై 15కి వాయిదా వేసింది .కాగా, ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య అనేక విమర్శలు, ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ కావడం కీలక పరిణామంగా నిలిచింది.

Latest News