Nirmala Sitharaman | నిర్మ‌ల‌మ్మ బ‌డ్జెట్ చీర స్పెష‌ల్ ఇదే.. నెట్టింట విప‌రీతంగా చ‌ర్చ‌

బడ్జెట్ 2026 సందర్భంగా నిర్మలా సీతారామన్ ధరించిన కాంజీవరం పట్టు చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమిళనాడు సంస్కృతి ప్రతిబింబించే చేనేత శారీగా ప్రశంసలు అందుకుంది.

Nirmala Sitharaman

Nirmala Sitharaman | ప్ర‌తి ఏటా బ‌డ్జెట్ స‌మ‌యంలో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ (Nirmala Sitharaman) ధ‌రించే చీర ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంటుంది. చాలా మంది బ‌డ్జెట్ కేటాయింపుల గురించి కంటే నిర్మ‌ల‌మ్మ చీర గురించే ఎక్కువ‌గా మాట్లాడుకుంటుంటారు. బ‌డ్జెట్‌కు ప‌ది రోజ‌లు ముందు నుంచే నిర్మ‌ల‌మ్మ చీర‌ల గురించి చ‌ర్చ మొద‌ల‌వుతుంటుంది. ఈసారి కూడా బ‌డ్జెట్ వేళ ప్ర‌త్యేక చీర‌లో మెరిశారు ఈ తెలుగింటి కోడ‌లు.

వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి (2026-27) పూర్తిస్థాయి బ‌డ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ (Nirmala Sitharaman) నిన్న పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పించిన విష‌యం తెలిసిందే. వ‌రుస‌గా తొమ్మిదోసారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన‌ నిర్మ‌ల‌మ్మ ఈ సారి కూడా ప్ర‌త్యేకమైన చీర‌లో క‌నిపించారు. త‌న సొంత రాష్ట్ర‌మైన త‌మిళ‌నాడు సాంస్కృతి, వార‌స‌త్వం ఉట్టిప‌డేలా చేనేత ప‌ట్టుచీర ధ‌రించారు. లైట్ గోల్డెన్ బ్రౌన్ చెక్స్‌తో ఉన్న మెరూన్ క‌ల‌ర్ కాంజీవ‌రం చీర‌లో క‌నిపించారు. మ‌రికొన్ని నెల‌ల్లో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్రానికి ప్రాముఖ్య‌త‌ను ఇస్తూ నిర్మ‌ల‌మ్మ కాంజీవ‌రం చీర‌ను ఎంపిక చేసుకున్న‌ట్లు రాజకీయ వ‌ర్గాల్లో విప‌రీతంగా టాక్ న‌డుస్తోంది. త‌మిళ‌నాడులో త‌యారుచేసే ఈ చేనేత ప‌ట్టుచీర‌ల‌కు 2005లో భౌగోళికంగా గుర్తింపు ల‌భించింది.

స్థానిక చేనేత‌ను ప్రోత్స‌హించే ఉద్దేశంతో..

స్థానిక చేనేత‌ను ప్రోత్స‌హించే రీతిలో అనేక ప్రాంతాల‌కు చెందిన చీర‌ల‌ను నిర్మ‌ల‌మ్మ బ‌డ్జెట్ వేళ ధ‌రిస్తూ ఉంటారు. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ స‌మయాల్లో ఒక్కో ప్రాంతానికి చెందిన చీర‌ను నిర్మ‌ల‌మ్మ ప్ర‌ద‌ర్శించారు. నిర్మ‌ల‌మ్మ బ‌డ్జెట్ చీర‌ల‌పై నెట్టింట విప‌రీతంగా చ‌ర్చ జ‌రుగుతూ ఉంటుంది. ఇలా చీర‌పై జ‌రుగుతున్న చ‌ర్చ‌పై నిర్మ‌ల‌మ్మ తాజాగా స్పందించారు. ఈ మేర‌కు కొంత‌మేర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. బ‌డ్జెట్ వేళ ఎలాంటి చీర ధ‌రిస్తార‌న్న ప్ర‌శ్న‌లు త‌న‌కు ఏటా స‌వాల్‌గా మారుతున్నాయ‌న్నారు.

బ‌డ్జెట్ వేళ నిర్మ‌ల‌మ్మ క‌ట్టిన చీరల గురించి..

2025లో మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ .. బీహార్‌కు చెందిన మ‌ధుబ‌ని ఆర్ట్ శారీలో ద‌ర్శ‌నం ఇచ్చారు. అంత‌కుముందు ఏడాది అంటే.. 2024లో ట‌స్స‌ర్ ప‌ట్టు చేనేత చీర‌, 2023లో బ్రౌన్ రంగులో టెంపుల్ బోర్డ‌ర్‌తో ఉన్న రెడ్ క‌ల‌ర్ శారీ, 2022లో ఒడిశా ప్రాంతానికి చెందిన చేనేత చీర‌, 2021లో భూదాన్ పోచంప‌ల్లి చీర‌, 2020లో బ్లూ బోర్డ‌ర్ ఉన్న పసుపు రంగు సిల్క్ చీర‌, 2019లో పింక్ క‌ల‌ర్ మంగ‌ళ‌గిరి చేనేత చీర‌ను ధ‌రించి ఆక‌ర్షించారు. ఇలా ఏటా ఏదో ఒక రాష్ట్రానికి చెందిన చీర‌లో నిర్మ‌ల‌మ్మ ద‌ర్శ‌న‌మిస్తుంటారు.

ఇవి కూడా చదవండి :

పిలిస్తే సిట్ విచారణకు వెళ్తా : కల్వకుంట్ల కవిత
Mega Family | మెగా కుటుంబంలో డబుల్ ఆనందం.. పిల్ల‌ల పేర్లు ఏంటో తెలుసా?

Latest News