విధాత:ఏపీ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పొడిగించవద్దని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రనాథ్ కేంద్ర పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి లేఖ రాశారు. కేంద్ర ఉద్యోగ శాఖ ఆధ్వర్యంలో ఉండే ఈ విభాగం కింద అఖిల భారత సర్వీసు ఉద్యోగులు ఉంటారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆదిత్యనాథ్ నిందితునిగా ఉన్నారని, ప్రజా సంక్షేమానికి తూట్లు పొడిచి సీఎం జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన కంపెనీలకు సాయం చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో ముద్దాయి అయిన ఇండియా సిమెంట్స్‌కు లిమిటెడ్‌కు నిబంధనలకు విరుద్ధంగా పది లక్షల లీటర్ల నీటికి కేటాయించారన్నారు. ఇలాంటి వ్యక్తిని అదే పదవిలో కొనసాగిస్తే ప్రజావ్యవస్థలపై నమ్మకం పోతుందని, అలాగే ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం పోతుందన్నారు. ఆదిత్యనాథ్ ఈనెల 30వ తేదీన రిటైర్ కావాల్సి ఉంది.