విధాత ప్రత్యేకం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చి పదేళ్లు పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి, కేసీఆర్ వంటి బలమైన జనాకర్షక నేత ఉండి కూడా ఎన్నికల్లో బీఆరెస్ ఓడిపోయింది. తెలంగాణ ఫలితాల పాఠాలను తమ రాష్ట్రంలో జరుగబోయే ఎన్నికలతో ముడిపెట్టి విశ్లేషించుకుంటున్న ఏపీ పార్టీలు.. వాటి ఆధారంగా వ్యూహరచన చేసుకుంటున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రత్యేకించి అధికార వైసీపీ ఈ ఫలితాలతో జాగ్రత్త పడుతున్నదని అంటున్నారు. బీఆరెస్ ఓటమికి ప్రధాన కారణాల్లో సిటింగ్‌లపై వ్యతిరేకత ఒకటి. దీనిని గ్రహించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. రాబోయే ఎన్నికల్లో భారీగానే సిటింగ్‌లకు టికెట్లు నిరాకరించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో పార్టీ ఇంచార్జీలను మార్చేశారు. అందులో ముగ్గురు మంత్రుల నియోజకవర్గాలు కూడా ఉండటం గమనార్హం. ఇప్పటిదాకా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధినే తమను మరోసారి గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్న ఏపీ సీఎం జగన్.. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం అకస్మాత్తుగా సిటింగ్‌ల మార్పు దిశగా చర్యలు చేపట్టడం ఆసక్తికర పరిణామమని పరిశీలకులు అంటున్నారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఈ మార్పులను చేసినట్టు వైసీపీ అధిష్ఠానం చెబుతున్నది. సర్వేలు, సమీక్షల ఆధారంగా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని, దాదాపు 40-50 సీట్లలో సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశముందని వైసీపీ అగ్రనేతలు బాహాటంగానే చెబుతున్నారు. అయితే సర్వేల్లో 100 సీట్లలో సిటింగ్‌లు ఎదురీతున్నారని తెలుస్తున్నది వారిలో కొందరు పక్క పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నది. సిటింగ్ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌ల మార్పుతో ఇప్పటికే అసంతృప్తికి గురైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవితోపాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. ఇన్‌చార్జ్‌ల మార్పుతో 11 నియోజకవర్గాల్లో అసమ్మతి భగ్గుమన్నది.
అయితే అసంతృప్తులతో స్వయంగా సీఎం జగన్ టచ్‌లోకి వస్తూ వారికి సర్దిచెబుతున్నారని, మార్పులకు కారణాలను వారికి వివరిస్తున్నారని సమాచారం. సామాజిక న్యాయం కోణంలో మార్పులు చేయాల్సి వస్తున్నదని చెబుతున్నారు. మళ్లీ అధికార సాధన కోసం ఎలాంటి మార్పులకైనా సిద్ధమని, రాజీ ప్రసక్తే లేదని వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే సృష్టం చేశారు. పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యం కాదని, కొత్త వారికి, గెలుపు గుర్రాలకు, మరిన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించేందుకు మార్పులు తప్పవని తేల్చారు.
పొత్తుల కూర్పులో విపక్షాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష పార్టీల పొత్తుల వ్యవహారాన్ని, సాధించిన ఫలితాలను విశ్లేషించుకుంటున్న టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ తమ తమ పొత్తు వ్యూహాలపై మథనం సాగిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తులో ఉన్నాయి. వామపక్షాలు టీడీపీతో వెళ్లాలా లేక తెలంగాణలో మాదిరిగా కాంగ్రెస్‌తో వెళ్లాలా? అనే విషయమై కసరత్తు ముమ్మరం చేశాయి. టీడీపీ సైతం వామపక్షాలను కలుపుకొనిపోతే బాగుంటుందనే అంచనాలో ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే బీజేపీని కలుపుకొనిపోవాలా లేక జనసేన, వామపక్షాలతో ముందుకు సాగితే మంచిదా? అనేది టీడీపీ తేల్చుకోవాల్సి ఉన్నది. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వైస్సార్‌టీపీ, టీజేఎస్‌లను పోటీ చేయకుండా ఒప్పించి, సీపీఐని కలుపుకుని కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో చాలచోట్ల త్రిముఖ పోటీలోనూ ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ ఫలితాలను ఏపీ విపక్షాలు సమీక్షిస్తూ పొత్తులపై కసరత్తు చేస్తున్నాయి.
ఏపీ కాంగ్రెస్‌కు తెలంగాణ కాంగ్రెస్ బూస్ట్
ఏపీలో బలహీనపడిన కాంగ్రెస్‌కు తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు రావడంతో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల నాయకత్వం ఏపీతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ బలమైన బీఆరెస్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాలు ఏపీలో ఎంతమేరకు ఫలితాలనిస్తాయనే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించిందని చెబుతున్నారు.
మరోవైపు ఏపీలో కాంగ్రెస్ బలోపేత వ్యూహాల్లో భాగంగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఢిల్లీ వేదికగా డిమాండ్ చేశారు. దానికోసం తన వంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై ప్రధాని హోదాలో మన్మోహన్‌సింగ్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, విభజన వేళ ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఏపీ కాంగ్రెస్‌కు బూస్ట్ ఇచ్చేందుకే ప్రత్యేక హోదా డిమాండ్‌ను పునరుద్ఘాటించిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.