కీలకమైన ప్నశ్రానపత్రాలను థర్డ్ పార్టీతో ఎలా మూల్యాంకన చేస్తారు?
-ప్నశ్నాపత్రాలను అభ్యర్థులకు ఇవ్వాల్సిందే
అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం
అఖిలపక్ష యువజన, విద్యార్థి సంఘాల డిజిటల్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయం
విధాత:ఎపిపిపిఎస్సీ గ్రూప్ -1 మెయిన్ అభ్యర్థుల మూల్యాంకనలో అవకతవకలు జరిగాయిని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే అఖిలపక్ష యువజన, విద్యార్థి సంఘాలతో ఎపిపిఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు ప్రకటించారు. బుధవారం తెలుగుయువత ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష యువజన, విద్యార్థి సంఘాల డిజిటల్ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ యువజన, విద్యార్థి సంఘాల నాయకులు, పలువురు అభ్యర్థులు హాజరయ్యారు. కీలకమైన ఎపిపిఎస్సీ గ్రూప్ -1 అభ్యర్థుల ప్రశ్నాపత్రాలను ముందుగా అభ్యర్థులకు తెలియజేయకుండా డిజిటల్ విధానంలో మూల్యాంకన చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాజ్యాంగ బద్ధమైన ఎపిపిఎస్సీ సంస్థ కీలకమైన గ్రూప్-1 ప్రశ్నాపత్రాలను థర్డ్ పార్టీ తో మూల్యంకన చేయించడమేమిటని అఖిలపక్ష నేతలు ప్రశ్నించారు. తక్షణమే అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాలని, గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల ప్రశ్నాపత్రాలను ఆన్ లైన్ లో ఉంచాలని సమావేశం డిమాండ్ చేసింది. అభ్యర్థులకు న్యాయం జరిగే పోరాడతామని సమావేశం ప్రకటించింది. సమావేశంలో వక్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలు మీ కోసం….
శ్రీరాం చినబాబు, తెలుగుయువత అధ్యక్షుడు
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ పాలన రావణాకాష్టంలా మారింది. ఎపిపిఎస్సీ లో క్వాలిఫై అయిన విద్యార్థుల డేటా, ప్రశ్నాపత్రాలు ఆన్ లైన్ లో పెట్టండి, సమర్థులైన గ్రూప్-1 అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అభ్యర్థులకు న్యాయం చేసేందుకు ఎక్కడికి వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నాం. మెయిన్స్ పరీక్షల్లో ఎన్నో అవకతవకలు జరిగాయి. ఇన్నిలక్షల పేపర్లు ఎలా స్కాన్ చేశారు, పరీక్షా పత్రాల వాల్యుయేషన్ లో వైసిపి ప్రభుత్వ ప్రభావం ఉంది, ఎన్నో అనుమానాలున్నాయి. లోకేష్ సారధ్యంలో ఎపిపిఎసి అభ్యర్థులతో కార్యాచరణను ముందుకు తీసుకెళ్తాం. రెండు,మూడురోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం. గ్రూప్ 1 లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం స్పందించకుంటే అఖిలపక్షంతో కలసి ఎపిపిఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.
7వేలమందిలో కేవలం 340మంది పాసయ్యారు, దీనిపై అభ్యర్థులు కోర్టుకు వెళ్లడానికి తెలుగుయువత సహకరిస్తుంది, భావితరాల వారికోసం అండగా ఉంటాం. అన్నిసంఘాలతో కలసి గవర్నర్ కు వినతిపత్రం అందజేస్తాం. స్పందించకపోతే ఎపిపిఎస్ సి కార్యాలయాన్ని ముట్టడిద్దాం. జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిద్దాం. గవర్నర్ కు లేఖ రాయడమేగాక అవకాశం ఉంటే ఆయనను ప్రతినిధి బృందం కలవాలి, ఎపిపిఎస్ సి కార్యదర్శిని కలిసి రిప్రజేంటేషన్ ఇస్తే బాగుంటుంది.
రాగాల ఆనందగౌడ్, తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎపిపిఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థుల గోడు చెవిటివాని ముందు శంఖం లా తయారైంది. ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే గ్రూప్ 1 అభ్యర్థుల మూల్యాంకనంలో చేతివాటం చూపారు. ఎపిపిఎస్సీ అభ్యర్థులు లోకేష్ ను కలిశారు, వారి తరపున తమ నాయకుడు లోకేష్ ప్రభుత్వానికి, సిఎంకు లేఖ రాశారు, యువజన, విద్యార్థి సంఘాలు ఏకం కావాలి, సిఎం జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు, మూర్ఖులను మార్చలేం, చెప్పేది వినడు, అతడు తెలుసుకోడు. ఉన్నత భవిష్యత్ ఉన్న గ్రూప్ -1 అభ్యర్థులను రోడ్డుకీడ్చారు. ఎపిపిఎస్సీ సభ్యులుగా అర్హతలేనివారిని నియమించారు. భావితరాల కోసం చేస్తున్న పోరాటానికి అండగా ఉంటాం. జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు, అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలి.
దినేష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
డిజిటల్ వాల్యుయేషన్ విషయాన్ని ముందుగా అభ్యర్థులకు ఎందుకు తెలియజేయలేదు, ఎపిపిఎస్సీ రాజ్యాంగ బద్ధసంస్థ, కీలకమైన గ్రూప్ -1 అభ్యర్థుల ప్రశ్నాపత్రాల మూల్యంకన థర్డ్ పార్టీకి ఇవ్వడమేంటి, దీనిని ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయండి. కొన్ని పేపర్లు మిస్ అయినా అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. అనుమానాల నివృత్తి కోసం పరీక్షలు రాసిన అభ్యర్థులకు పేపర్లు ఇవ్వాలి, డిజిటల్ కు సంబంధించి సాంకేతిక వివరాలపై శ్వేతపత్రం ఇవ్వాలి, రెస్పాన్స్ షీట్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరించాలి.
ఎంవి సుబ్బారావు, ఎఐఎస్ఎఫ్
గతంలో ఎపిపిఎస్సి నిర్వహించిన పరీక్షలపై అభ్యర్థులు పలుమార్లు కోర్టుకు వెళ్లారు, ఎపిపిఎస్సీసి ఈరోజు వచ్చిన సంస్థ కాదు, 70 శాతం విద్యార్థులు అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్నారు, మాన్యువల్ గా పరీక్షపేపర్లు దిద్దాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వంలో చలనం లేదు, మేం చెప్పిందే వేదం అనేవిధంగా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వం చెప్పినట్లే సెక్రటరీ వ్యవహరిస్తున్నారు, ఒక్క సమస్య పరిష్కరానికి కూడా ఎపిపిఎస్సీ చొరవచూపలేదు. ఎపిపిఎస్సీని ప్రక్షాళన చేయాలి. పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల వ్యవహారంలో కూడా ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు, ఎపిపిఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి, ఫిర్యాదులపై విచారణ జరపాలి, అభ్యర్థులు అప్పులుచేసి కోచింగ్ తీసుకున్నారు, భవిష్యత్ లో ఏవిధంగా ఎపిపిఎస్సీని నమ్ముతారు. ఎపిపిఎస్సీ అనాలోచిత చర్య వల్ల ఎంపిక కాని అభ్యర్థులు అఘాయిత్యానికి పాల్పడే ప్రమాదముంది. అవకతవకలపై రాష్ట్రప్రభుత్వం ఐఎఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయాలి. అన్నిసంఘాలు ఐకమత్యంగా అభ్యర్థుల తరపున నిలబడకపోతే అన్యాయం జరుగుతుంది. ఎపిపిఎస్సీ గ్రూప్ -1 అభ్యర్థుల ఆందోళనకు ఎఐఎస్ఎఫ్ మద్దతు తెలుపుతోంధి.
శిరీషారెడ్డి, అభ్యర్థి
ఎపిపిఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల్లో తప్పిదం జరిగింది, తెలుగు ఒఎంఆర్ షీట్ లో మిస్ మ్యాచ్ జరిగాయి. తాము ఆరోజే ఈ తప్పును లేవనెత్తాం. దీనివల్ల మేం నష్టపోయాం. ఈ తప్పును ఎపిపిఎస్సీ ఎలా సరిదిద్దిందో చెప్పలేదు. అప్పుడే మెయిల్ పెట్టాం, దీనికి ఇంతవరకు సమాధానం లేదు. డిజిటల్ వ్యాల్యుయేషన్ తో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారు. 30సంవత్సరాల భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేశారు, లక్షల కాపీల కరక్షన్ కు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు, స్కానింగ్ చేసేవారు తక్కువ స్థాయివారు చేస్తారు, దీనిపై మాకు అనుమానం ఉంది. వీటన్నింటికీ సమాధానం చెబితే మంచిది, ఆన్సర్ షీట్ ను మాకు డిజిటల్ గా ఇవ్వండి, లేకపోతే మున్ముందు చాలా ప్రమాదం జరుగుతుంది, ఇంటర్వ్యూలకు సమయం ఉంది కాబట్టి పోరాడుతున్నాం, మేం చేసిన తప్పు ఏమిటో తెలియజేయండి, ఏ కటాఫ్ తో ఎంపిక చేశారో తెలియ చేయండి.
ప్రణీత, గ్రూప్ 1 అభ్యర్థుల నేత.
ప్రశ్నాపత్రాల మూల్యాంకనం కోసం కొత్తగా డిజిటల్ విధానం తెచ్చారు, పారదర్శకంగా ఉంటుందని భావించాం. ఈ విధానంలో కూడా ఫలితాల ప్రకటనకు నాలుగునెలలు పట్టింది, గతంలో మాన్యువల్ కు కూడా ఇంతే సమయం పట్టింది, ఎటువంటి పైలట్ కార్యక్రమం లేకుండా నేరుగా ప్రవేశపెట్టడం సరికాదు. 50వేల పత్రాలను దిద్దేటపుడు సాంకేతిక సమస్యలు రావచ్చు. ప్రిలిమ్స్ ఫలితాల రెండో జాబితాలో వారికి 25రోజులే సమయం ఇచ్చారు. కొందరికి అయిదు పరీక్షలు ఒకచోట, రెండుపరీక్షలు మరోచోట అవకాశం ఇచ్చారు. ఎపిపిఎస్సీసి దీనిపై స్పష్టత ఇవ్వాలి. 75మంది స్పోర్ట్స్ కోటాకింద ఎంపిక చేశారు, వాల్యుయేషన్ నిర్వహణలో పారదర్శకతపై శ్వేతపత్రం ఇవ్వండి. మాకు పరీక్షాపత్రాలను చూపించండి, దీనిపై స్పష్టత ఇస్తే సంతోషిస్తాం, మాకోసం తెలుగుయువత ఆధ్వర్యంలో పోరాటం చేయడం సంతోషకరం.
రవిబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు
గ్రూప్ 1 డిజిటల్ వాల్యుయేషన్ తో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి, నిజాయితీగా వాల్యుయేషన్ చేశారా అన్న అనుమానం కలుగుతోంది, ప్రభుత్వ విధానాలు తప్పుల తడకగా ఉన్నాయి, సచివాలయ ఉద్యోగుల రాతపరీక్షలో కూడా చాలా తప్పులు దొర్లాయి. అధికారపార్టీ వారికే ఎక్కువగా ఉద్యోగాలు వచ్చాయి. ఏ పరీక్ష రాసినా ప్రతిభగల వారికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తున్నారు. దీనివల్ల గతంలో కష్టపడి పరీక్షలు రాసి ఎంపికైన వారికి అన్యాయం జరుగుతుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి మెరిట్ అభ్యర్థులతో అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వానికి ప్రతిభ అవసరం లేదు, 7వేలమంది పరీక్షలు రాస్తే 340మంది పాస్ కావడం ఏమిటి? ముందుగా చెప్పకుండా డిజిటల్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు, ఎంతో కష్టపడి చదివిన అభ్యర్థులకు అన్యాయం జరిగింది. అభ్యర్థులకు మేలుచేసే విధానాన్ని పాటించాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ విషయంలో కూడా విద్యార్థి, యువజన సంఘాలు మాకు మద్దతు ఇవ్వాలి.