విధాత:వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసారు.అత్యంత ముఖ్యమైన ఈ హిందూ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులందరూ కలిసి జరుపుకుంటారని,భక్తులు తమ ప్రయత్నాలకు ఎదురవుతున్నఅన్ని అడ్డంకులు తొలగిపోయి కోరుకున్న విధంగా పనులు విజయవంతం కావాలని శ్రీ విఘ్నేశ్వరుడికి ప్రార్థనలు చేస్తారన్నారు. పండుగ శుభవేళ ప్రజలు తమ నూతన వ్యాపారాలు విజయవంతం కావాలని వినాయకుడిని వేడుకోవటం అనవాయితీగా వస్తున్న ఆచారమని గవర్నర్ ప్రస్తుతించారు.
శాంతి, సామరస్యపూర్వకమైన జీవితాన్ని ప్రజలందరికీ ప్రసాదించాలని, కరోనా మహమ్మారి పరిస్థితులను అధిగమించడానికి మనందరికీ శక్తిని అందించాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నానని గవర్నర్ అన్నారు. పండుగ వేళ సైతం ముసుగు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించటం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవటం వంటి కరోనా ప్రవర్తనా నియమావళి విషయంలో ఎటువంటి అజాగ్రత్త కూడదని, ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని గౌరవ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.