వైసీపీకి మరో కుదుపు

ఆంధ్రప్రదేశ్ లో రానున్న శాసన సభ, లోక్ సభ ఎన్నికలకు ఇప్పటికే మూడు జాబితాలతో అభ్యర్థులను ప్రకటించిన అధికార వైసీపీ.. నాలుగో జాబితాపై కసరత్తు చేస్తోంది

  • Publish Date - January 17, 2024 / 02:51 PM IST

– టీడీపీ వైపు తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి చూపు

– విశాఖలో మరో వికెట్ ఔట్

– నిన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ.. నేడు సీతంరాజు సుధాకర్ గుడ్ బై

– జగన్ వద్దకు నరసరావుపేట, ఒంగోలు ఎంపీ టికెట్ల పంచాయితీ

– సీఎంవోకు క్యూకట్టిన అసమ్మతి నేతలు

విధాత: ఆంధ్రప్రదేశ్ లో రానున్న శాసన సభ, లోక్ సభ ఎన్నికలకు ఇప్పటికే మూడు జాబితాలతో అభ్యర్థులను ప్రకటించిన అధికార వైసీపీ.. నాలుగో జాబితాపై కసరత్తు చేస్తోంది. నేడో, రేపో అభ్యర్థులను ఖరారు చేసి తుది జాబితా ప్రకటించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్పులు, చేర్పుల్లో భాగంగా కొందరి సిటింగ్ లను సీఎం జగన్ తప్పించారు. మరికొందరి స్థానాలు మారుస్తూ ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేశారు. సీటు గల్లంతైన సిటింగ్ లు రగులుతున్నారు. ఈక్రమంలోనే అధికార వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ దిశగా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే నాలుగో జాబితా వరకు ఆయన వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ కేటాయించకపోతే రాజీనామాకు సిద్ధమైనట్లు సమాచారం. టీడీపీలో చేరి పామర్రు టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు సార్లు గెలిచినా వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంపై రక్షణ నిధి గుర్రుగా ఉన్నారు.

విశాఖలో మరోనేత గుడ్ బై

విశాఖపట్నం వైసీపీలో కీలక నేతల రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఆపార్టీని వీడి జనసేనలో చేరారు. తాజాగా మరో కుదుపు అధిష్టానాన్ని కునుకులేకుండా చేస్తోంది. వైసీపీకి విశాఖకు చెందిన మరోనేత గుడ్ బై చెప్పారు. విశాఖ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ మీడియా వేదికగా అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో వన్ సైడ్ లవ్ భరించలేక పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా తనకు అవమానమే ఎదురైందని వాపోయారు. విశాఖలో వైసీపీని ఖాళీ చేయడమే లక్ష్యంగా పని చేస్తానని ప్రతినబూనారు. విశాఖ నగర పార్టీలో జరుగుతున్న వరుస రాజకీయ పరిణామాలు తనను ఆవేదనకు గురిచేశాయని, ఈక్రమంలోనే పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు చెప్పారు. తనతో పాటు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో సగం మంది కార్పొరేటర్లు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ మత్స్యకార, ఎస్సీ ముఖ్య నాయకత్వం సూచనలకు అనుగుణంగా త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాని స్పష్టం చేశారు. కాగా సుధాకర్ కు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తో విభేదాలు తారస్థాయికి చేరాయి. అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

టీడీపీలోకి బొప్పన భవకుమార్?

రెండు రోజుల క్రితం వైసీపీ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగరేసిన విజయవాడ కీలక వైసీపీ నేత బొప్పన భవకుమార్ టీడీపీ నేతలకు టచ్ లోకి వెళ్లారు. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న భవకుమార్ తన అనుచరులతో వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో బుధవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిశారు. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, ఇతర ప్రముఖ నాయకులు రంగంలోకి దిగి భవకుమార్ ను బుజ్జగించే ప్రయత్నాలు సఫలం కాలేదు. ఈనేపథ్యంలో భవకుమార్ … నారా లోకేశ్ ను కలవడం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. కాగా 2019 ఎన్నికల్లో భవకుమార్ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో ఓటమిచెందారు. ఇదిలాఉండగా ఆంధ్రప్రదేశ్ కు ప్రధాన రాజకీయ కేంద్రమైన విజయవాడలో వరుసగా ప్రముఖ నేతను కోల్పోవడం వైసీపీకి తీవ్ర నష్టం చేకూరనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోసారి సీఎంవోకి వచ్చిన బాలినేని

వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ప్రకాశం జిల్లా వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి బుధవారం సీఎం జగన్ పిలుపుతో సీఎంవోకు వచ్చారు. ఒంగోలు ఎంపీగా మాగుంట టికెట్ తో పాటు గిద్దలూరు, దర్శి, కొండేపి ఇన్ చార్జిల నియామకంలో తనమాట చెల్లలేదని బాలినేని గత కొంతకాలంగా అధిష్టానానికి దూరంగా ఉంటూ వచ్చారు. తనతో ఏ మాత్రం చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని అసంతృప్తితో ఉన్నారు. ఈక్రమంలో సీఎంవో సహా వైసీపీ ముఖ్య నేతల సంప్రదింపులతో బాలినేని ఎట్టకేలకు తాడేపల్లికి వచ్చినట్లు సమాచారం.

పెనమలూరులో జోగి రమేష్ కు తిప్పలు

పెనమలూరు రాజకీయాల్లో కీలకపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మంత్రి జోగి రమేష్ కు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగిస్తూ సీఎం జగన్ ప్రకటించారు. దీంతో సిటింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పార్టీకి గుడ్ బై చెప్పారు. దీన్ని లెక్కచేయని అధిష్టానానికి ప్రస్తుతం మరో దెబ్బ ఎదురైంది. జోగి రమేష్ ను ఇన్ చార్జిగా నియమించడాన్ని ముందునుంచి పడమట సురేష్ బాబు వర్గం వ్యతిరేకిస్తోంది. ఈనేపథ్యంలో జోగి రమేష్ స్థానిక వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా నియోజకవర్గంలో భారీగా జోగికి వ్యతిరేక ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. దీన్ని అప్రమత్తమైన మంత్రి బుధవారం నియోజకవర్గంలో పర్యటించారు. పెనమలూరు ఇన్ చార్జిగా పార్టీ అసమ్మతి నేతలను కలుస్తూ బుజ్జగించే పనిలో పడ్డారు. ఈక్రమంలో పడమట సురేష్ బాబు ఇంటికి జోగి రమేష్ వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో సహకరించాలని కోరారు. అసమ్మతుల బెడదతో పెనమలూరులో జోగి రమేష్ సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.