ఉన్నమాట: ఆంధ్ర ప్రదేశ్‌కు మూడు రాజధానులను నిర్ణయిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న విధానాన్ని ఇప్పటికైనా పూర్తిస్థాయిలో ఉపసంహరించుకోవడం ఆయనకు రాజకీయంగా, రాష్ట్రానికి అభివృద్ధి పరంగా మంచిది. మూడు రాజధానుల వాదన ఏ విధంగా చూసినా, ఏ తర్కంతో చూసినా న్యాయబద్ధంగా అనిపించదు. దేశ చరిత్రలో మూడు రాజధానులు ఉన్న రాష్ట్రం మరొకటి లేదు.
ముఖ్యమంత్రి లేక అసెంబ్లీ పదవీకాలం ఐదేళ్లకు పరిమితం. ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాజధానిని మార్చడం అనే సంప్రదాయం మొదలుపెడితే ఏరాష్ట్రమూ ఒక సుస్థిరతను, నిలకడైన అభివృద్ధిని కానీ సాధించలేదు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఆలోచనే రాజకీయ అస్థిరతకు పునాది. ఎన్నికకు ఎన్నికకు రాజధానిని మార్చుకోవచ్చు అన్న వాదనను ఒకసారి అంగీకరిస్తే రాష్ట్రంలో రాజకీయ అస్థిరత, అభివృద్ధి ప్రతిష్టంభన శాశ్వతంగా తిష్టవేసుకుని కూర్చుంటాయి.
అభివృద్ధి వికేంద్రీకరణ వేరు బహుళ రాజధానులను ఏర్పాటు చేయడం వేరు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి రాజధాని పేరే ఉండనవసరం లేదు. విశాఖను పారిశ్రామిక రాజధానిగా, ఐటీ రాజధానిగా అభివృద్ధి చేయవచ్చు. తిరుపతి, నెల్లూరు, అనంతపురం, కుర్నూలులలో విద్య , పారిశ్రామికవాడల అభివృద్ధికి ఇప్పటికే పునాదులు పడ్డాయి. ఒకే రాజధానిని కొనసాగించి రాజకీయ సుస్థిరతకు ఇబ్బంది లేకుండా చేయడం ద్వారా అభివృద్ధికి మరింత విస్తృతంగా బాటలు వేయాలి.
అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు ప్రభుత్వం కంటే భారీగా పెట్టుబడులు పెట్టవలసింది ప్రైవేటు రంగం. రాజధానిపై అస్థిరత కొనసాగినంతకాలం దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే స్వదేశీ, విదేశీ కంపెనీలు ఏవీ నమ్మకంగా రాష్ట్రానికి రావడం సాధ్యం కాదు. ఇది తుగ్లక్ నాయకుల రాష్ట్రము అనే పేరు వస్తే ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు. రేపు పవన్ కళ్యాణ్ లేక మరో నాయకుడు ఎవరయినా అధికారంలోకి వచ్చి రాజధానిని చారిత్రక రాజమహేంద్రవరానికో, వేంగీ ప్రాంతానికో మార్చుతామంటే జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తారా?
ప్రధానంగా జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం ఏ నైతిక ప్రమాణానికి నిలబడదు. ఒకటి, రాష్ట్ర రాజధానిని నిర్ణయించిన కాలంలో జగన్‌మోహన్‌రెడ్డి ఆ ప్రతిపాదనను వ్యతిరేకించలేదు. పైగా ఆమోదిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. రాజధాని శంకుస్థాపన మహోత్సవంలో ప్రధాని, పొరుగు రాష్ట్రాల ప్రముఖులు పాల్గొన్నారు. అంటే కొత్త రాజధానిని ప్రధాని ఆమోదించారనే భావించాలి.
రెండు, కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం భారీగానే నిధులు విడుదల చేసింది. ఆ నిధులతో భారీ ఎత్తున నిర్మాణాలు ప్రారంభించారు. అందులో కొన్ని 70 శాతం, కొన్ని 50 శాతం, కొన్ని 20 శాతం పనులు పూర్తయి ఉన్నాయి. ఇవి కాకుండా తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుల నిర్మాణమూ జరిగింది. మూడు, ఒక వేళ ఆ తర్వాత విధానం మార్చుకున్నారన్నా 2019 ఎన్నికల ముందు మూడు రాజధానులపై తన ఎన్నికల ప్రణాళికలో కానీ, ప్రచారంలోకానీ ఎక్కడా చెప్పలేదు.
నాలుగు, గుంటూరు విజయవాడల మధ్య రాజధానిని ఏర్పాటు చేయాలన్న డిమాండు ఇప్పటిదికాదు. అనేక దశాబ్దాలుగా నలుగుతున్నదే. 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడే రాజధానిని గుంటూరు విజయవాడల మధ్య ఏర్పాటు చేయాలన్న డిమాండు వచ్చింది. కానీ రాయలసీమ నాయకులతో కుదిరిన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఒక ప్రాంతంలో హైకోర్టు ఉంటే ఇంకో ప్రాంతంలో రాజధాని ఉండాలన్న అంగీకారం జరిగింది.
ముందుగా రాజధానిని నిర్ధారించడానికి ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలతో సమావేశం జరిపి ఓటింగు జరిపించారు. విజయవాడ గుంటూరులలో రాజధాని ఏర్పాటు ప్రతిపాదనకు అనుకూలంగా 62 ఓట్లు వ్యతిరేకంగా 58 ఓట్లు వచ్చాయి. అయితే ఇందులో ఒక కుట్ర జరిగింది. కర్నూలుకు 63 ఓట్లు వచ్చినట్టుగా నిర్ణయించి విజయవాడ గుంటూరు ప్రతిపాదన వీగిపోయినట్టుగా ప్రకటించారు. ఆ రోజే ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలు పతాక శీర్షికల్లో ఈ తతంగమంతా ప్రచురించాయి. జరిగిన కుట్రను వివరించాయి.
– Yelasiri Rajashekar