విధాత : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది కనుమ పండుగను పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున నిర్వహించే ‘కాకబలి’ కార్యక్రమానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. కాక బలి ఉత్సవంలో భాగంగా అర్చక స్వాములు పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన అన్నాన్ని ఆనంద నిలయం విమాన వేంకటేశ్వరస్వామివారికి, అాలాగే ఇతర దేవతలకు కూడా నివేదిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొని శ్రీవారి సేవలో తరిస్తారు. కనుమ రోజున శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం నిర్వహించే ఒక ముఖ్యమైన పూజా కార్యక్రమంగా ‘కాకబలి’ కొనసాగుతుంది.
ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజున తిరుమల ఆలయ అంతర ప్రాకారంలో కొలువైన ఆనంద నిలయ వేంకటేశ్వర స్వామికి ఈ ప్రత్యేక నైవేద్యం సమర్పించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అర్చకులు వండిన అన్నంలో పసుపును, కుంకుమను విడివిడిగా కలిపి ఆనంద నిలయంపై చల్లుతారు. ఈ ఆచారం తోమాల సేవ మరియు కొలువు మధ్య ఉదయం 4:15 గంటలకు నిర్వహించబడుతుంది.
