Shiva Jyothi | తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ‘తీన్మార్ సావిత్రి’గా సుపరిచితమైన యాంకర్ శివ జ్యోతి తన జీవితంలోనే అత్యంత ఆనందకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నారు. తెలంగాణ యాస, సహజమైన ప్రెజెంటేషన్, సంప్రదాయ కట్టుబొట్టు, చురుకైన వ్యాఖ్యానంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో అభిమానులు, టీవీ ఇండస్ట్రీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన శివ జ్యోతి తన కెరీర్‌ను సాధారణ న్యూస్ రీడర్‌గా ప్రారంభించారు. వీ6 న్యూస్ ఛానల్‌లో ప్రసారమైన ‘తీన్మార్’ స్టైల్ కథనాలతో ఆమెకు తొలి గుర్తింపు లభించింది. తెలంగాణ సొగసైన మాటతీరు, చమత్కారమైన వ్యాఖ్యానం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో తక్కువ కాలంలోనే ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించారు. షోలో ఆమె నిజాయితీగా మాట్లాడే తీరు, ఎమోషనల్ మోమెంట్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేశాయి.
కెరీర్ పరంగా ఎదుగుతూ యాంకరింగ్, సోషల్ మీడియా, యూట్యూబ్ కంటెంట్‌లతో బిజీగా కొనసాగుతున్న సమయంలోనే ఆమె వ్యక్తిగత జీవితంలో ఒక లోటు వెంటాడింది. పదేళ్ల క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గంగూలీతో ప్రేమ వివాహం చేసుకున్న శివ జ్యోతి దంపతులకు సంతానం లేకపోవడం బాధ కలిగించింది. పిల్లల కోసం ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకోవడం, పూజలు-వ్రతాలు చేయడం వంటి ప్రయత్నాలు చేశారు. దాదాపు పదేళ్ల నిరీక్షణ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు స్వయంగా ప్రకటించారు.
సోషల్ మీడియాలో చేసిన ఎమోషనల్ పోస్టులో “హ్యాపీ బర్త్‌డే చిన్నీ… నా 33వ పుట్టినరోజుకు జీవితంలోనే బెస్ట్ గిఫ్ట్ వచ్చింది. ఫిబ్రవరి 12న మా బిడ్డ పుట్టింది. రెండు హృదయాల నుంచి ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం” అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. అయితే బిడ్డ అబ్బాయా, అమ్మాయా అనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే జెండర్ రివీల్ చేస్తామని కూడా స్పష్టం చేశారు.
ఈ శుభవార్త వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. అభిమానులు, స్నేహితులు, టీవీ ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ కామెంట్ల రూపంలో అభినందనలు తెలియజేస్తున్నారు. పదేళ్ల కల నెరవేరడంతో శివ జ్యోతి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆమె జీవితంలో వచ్చిన ఈ కొత్త అధ్యాయం అభిమానుల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతోంది.
