Site icon vidhaatha

వివేకా హత్య కేసులో న్యాయం జరగలేదు… మళ్లీ దర్యాప్తు ఎందుకు జరగొద్దు : షర్మిల

విధాత : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తు మళ్లీ ఎందుకు జరగకూడదని ఆమె ప్రశ్నించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, వివేకా హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు పోరాటం చేస్తున్నా ఇంతవరకు న్యాయం జరగలేదని ఆమె అన్నారు. సునీత పోరాటంలో న్యాయం ఉందన్నారు. ఈ కేసులో సీబీఐ అనుకుంటే నిందితులు ఎప్పుడో దొరికి ఉండేవారన్నారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన ఇంట్లోనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తు పూర్తైందని ఇటీవలనే సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ప్రస్తుతానికి పెండింగ్ లో లేదని సొలిసిటర్ జనరల్ ఈ ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టుకు తెలిపారు. కోర్టు ఏవైనా ఉత్తర్వులు ఇస్తే దానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.

వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్ రద్దు చేయాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 19న సుప్రీంకోర్టు విచారించింది. అయితే ఈ కేసు దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని సునీత తరపు న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదించారు. ఈ హత్య కేసు సూత్రధారులు ఎవరో తేలాల్సినన అవసరం ఉందన్నారు. నిందితుల బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమో లేదో చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐని కోరింది. విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.

Exit mobile version