విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)నిర్మాణ అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్ధని..తదుపరి విచారణ వరకు ఈ ఆదేశాలను పాటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు(Telangana High Court order) ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao petitions)లు వేసిన పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారించింది. కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లకు విచారణార్హత లేదని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వాదించారు. కాళేశ్వరం నివేదిక పై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించిందని..ఎలాంటి చర్యలు తీసుకోలేదని..కమిషన్ రిపోర్టులో యాక్షన్ టేకెన్ రిపోర్టు లేదని తెలిపారు.
అసెంబ్లీలో ప్రభుత్వం సీబీఐ(CBI) విచారణ కోరినట్లుగా ప్రకటన చేసింద కదా అని హైకోర్టు ఈ సందర్భంగా ఏజీకి గుర్తు చేయగా..సీబీఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిందని..అయితే బాధ్యులపై సీబీఐ విచారణ తర్వాతే చర్యలు తీసుకుంటారని ఏజీ స్పష్టం చేశారు. ప్రభుత్వ వాదనను..పిటిషన్ల ఆందోళనను విన్న హైకోర్టు ప్రస్తుతం కాళేశ్వరం నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్ధని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ..తదుపరి విచారణను ఆక్టోబర్ 7కు వాయిదా వేశారు. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్ధని ఆదేశించింది. దసరా వెకెషన్స్ తర్వాతా వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.
హైకోర్టు తాజా ఆదేశాలతో ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారికి తాత్కాలికంగా ఊరట దక్కినట్లయ్యింది. అయితే కాళేశ్వరం నిర్మాణ అవకతవకలపై సీబీఐ విచారణ కోరాలన్న ప్రభుత్వం నిర్ణయంపై మాత్రం హైకోర్టు ఈ సందర్భంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వానికి సీబీఐ విచారణ అంశంపై ముందుకు వెళ్లడంలో ఆటంకాలు లేవని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణ అవకతవకలపై విచారణ చేయాలని కోరుతూ సీబీఐకి, కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ఇందుకు సీబీఐ రాష్ట్రానికి రావడానికి తమకు అభ్యంతరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చే పనిలో ఉంది.