అభ్యర్థుల జాబితాలు.. వైసీపీకి వరుస షాక్ లు

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత, సీఎం జగన్ నాలుగో జాబితా కసరత్తులో బిజీ అయ్యారు.

  • Publish Date - January 18, 2024 / 12:36 PM IST

– ఏపీ టికెట్ల కేటాయింపులో అధిష్టానం ఉక్కిరిబిక్కిరి

– విశాఖలో రాజీనామాలకు క్యూకట్టిన కార్పొరేటర్లు

– నలుగురు వైసీపీ కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు

– అధిష్టానం హెచ్చరికలనూ లెక్కచేయని వైనం

– అమలాపురంలో కీలకనేత వాసంశెట్టి గుడ్ బై

– నాలుగో జాబితాపై కసరత్తు తుది దశకు..?

విధాత: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత, సీఎం జగన్ నాలుగో జాబితా కసరత్తులో బిజీ అయ్యారు. మరోవైపు ఇప్పటికే వరుస జాబితాలతో రాజుకున్న అసమ్మతి ఇంకా చల్లారనే లేదు. పలు నియోజకవర్గాల్లో టికెట్ దక్కని సిటింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు పార్టీకి వరుస షాక్ లు ఇస్తున్నారు. ఈనేపథ్యంలో గురువారం సీఎంవోకు మంత్రులు అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చారు. సీఎం జగన్ తో ప్రత్యేకంగా సమావేశమై టికెట్ల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాత సీఎంవో పిలుపుతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా జగన్ ను కలిశారు. ఈసందర్భంగా కందుకూరు, కనిగిరి ఇన్ చార్జిల మార్పుపై జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. మార్కాపురం ఇన్ చార్జి మార్పుపై కూడా జగన్ కసరత్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పేరును దాదాపు ఖరారు చేశారు. సిటింగ్ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి ఈసారి టికెట్ లేనట్లే అని తెలుస్తోంది. నాలుగో జాబితాలో ఏకంగా 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. నర్సరావుపేట, గుంటూరు, మచిలీపట్నం, రాజమండ్రి, కాకినాడ, బాపట్ల, కడప, రాజంపేట, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

– విశాఖలో కార్పొరేటర్ల అలజడి

విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పాలకవర్గంలో మరోసారి అలజడి మొదలైంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో కార్పొరేటర్లలో అసంతృప్తులు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. పార్టీలో ఇమడలేమంటూ టీడీపీ, జనసేన గూటికి చేరుతున్నారు. వీరంతా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహార శైలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలో అధికార వైసీపీ నుంచి కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. దక్షిణ నియోజకవర్గ పరిధిలోని ఇద్దరు కార్పొరేటర్లు ఇప్పటికే వైసీపీని వీడి జనసేనలో చేరారు. తాజాగా అదే నియోజకవర్గానికి చెందిన మరో నలుగురు కూడా పార్టీని వీడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా సిటింగ్ ఎమ్మెల్యే వాసుపల్లికి వ్యతిరేకంగా విలేకరుల సమావేశం పెట్టారని ఆపార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధిష్టానం విశాఖపట్నంలో నలుగురు వైసీపీ కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ అధిష్టానం ఈ మేరకు చర్యలు చేపట్టింది. విశాఖలోని 29వ వార్డు ఉరుకూటి నారాయణరావు, 31వ వార్డు బిపిన్ జైన్, 35వ వార్డు భాస్కర్ రావు, 37వ వార్డు జానకిరామ్ లను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు.

– దెబ్బకొట్టిన వంశీకృష్ణ, సీతంరాజు

విశాఖపట్నంలో వైసీపీకి కీలక నేతలుగా ఉన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఇటీవలే పార్టీకి గుడ్ బై చెప్పారు. వంశీకృష్ణ ఇప్పటికే జనసేన గూటికి చేరగా, సుధాకర్ తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బుధవారం ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను భేటీ కావడం చర్చనీయాంశమైంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలోని 8 మంది కార్పొరేటర్లు సుధాకర్ అనుచరులుగా కొనసాగుతున్నారు. వైసీపీని విశాఖలో ఖాళీ చేయించడమే తన పంథమని శపథం చేసిన సుధాకర్.. తన అనుచర వైసీపీ కార్పొరేటర్లతో రాజీనామాలు చేయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే పలువురు కార్పొరేటర్లపై వైసీపీ అధిష్టానం వేటు వేసినట్లు తెలుస్తోంది.  

 

– అమలాపురంలో బయటపడ్డ విభేదాలు

ఉభయ గోదావరి జిల్లాల్లో అధికార వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్టీలో విభేదాలు పొడచూపాయి. వైసీపీ కీలకనేత వాసంశెట్టి సుభాశ్ కు స్థానిక నేతలతో విభేదాలు ఉన్నాయి. ఈక్రమంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తనతో పాటు ఒక కౌన్సిలర్, పలువురు ఎంపీటీసీలను కూడా వెంటబెట్టుకెళ్లారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టున్న కీలక నేత సుభాశ్ రాజీనామా ఆపార్టీలో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక నేతలతో విభేదాల కారణంగానే పార్టీకి రాజీనామా చేసినట్లు సుభాశ్ ఈ సందర్భంగా వెల్లడించారు. 

ఆత్మాభిమానాన్ని చంపుకోలేను..

– డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ టికెట్ వైసీపీ స్థానిక నేతల్లో రోజురోజుకూ ఆజ్యం పోస్తోంది. ఈ క్రమంలో సిటింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నారాయణస్వామి గురువారం పుత్తూరు నివాసంలో 6 మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. టికెట్ పై ఆశలు సన్నగిల్లుతున్నతరుణంలో ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు టికెట్ రాకపోతే ఆత్మాభిమానాన్ని చంపుకొని జానేందర్ రెడ్డితో కలసి పనిచేసేది లేదని తేల్చేశారు. కాపాడుకోవడానికి తనకు ఏమీ ఆస్తులు, అంతస్తులు లేవని అన్నారు. నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ మండల నేతల సమావేశంలో చెప్పడం టికెట్ల లొల్లిని బహిర్గతం చేస్తోంది. మానేతకు టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని మరికొందరు స్థానిక నేతలు అంటున్నారు. కలిసి పనిచేసేది లేదంటూ నారాయణస్వామి తెగేసి చెప్పడం సంచలనంగా మారగా, ఆస్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో రాజకీయ వేడి రగులుకుంది.