– ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రుల కూతుళ్లే..
– బీజేపీకి దగ్గుబాటి పురంధేశ్వరి, కాంగ్రెస్ కు షర్మిల బాధ్యతలు
– ఆ రెండు పార్టీలకు ఇద్దరూ తొలి మహిళా అధ్యక్షురాళ్లుగా రికార్డు
– ఆంధ్రప్రదేశ్ లో అరుదైన ఘట్టం
– జాతీయ పార్టీల సారథ్యం.. ప్రాంతీయ పార్టీలతో ఢీ
విధాత, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రెండు ప్రధాన పార్టీలను మహిళలు సారథులుగా నడిపిస్తున్నారు. ఇద్దరూ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినా.. కాకతాళీయమే అయినా ఇరువురు అధ్యక్షులూ మాజీ ముఖ్యమంత్రుల కూతుళ్లు కావడం విశేషం. ఒకరు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి కొనసాగుతుండగా, మరొకరు జాతీయ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నూతనంగా నియమితులయ్యారు. దగ్గుబాటి పురంధేశ్వరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కూతురు కాగా, వైఎస్ షర్మిల అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు. ఈ రెండు పార్టీలకు ఇద్దరూ తొలి మహిళా అధ్యక్షురాళ్లుగా రికార్డు నెలకొల్పడం మరో విశేషం. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు నగారా మోగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సెగలు కమ్ముకున్నాయి. ఎన్నికల ముంగిట ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పగ్గాలను అతివలు తమ చేతుల్లోకి తీసుకున్నారు. కేంద్ర పార్టీలకు పగ్గాలు చేపట్టినా.. ప్రాంతీయ పార్టీలైన అధికార వైసీపీ, టీడీపీ, జనసేనతో రాబోవు ఎన్నికల్లో మహిళలు ఢీకొట్టనుండడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశమైంది.
– తొలిసారిగా మహిళా నాయకురాలిగా పురంధేశ్వరికి బీజేపీ పగ్గాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాఖకు 1980 బీజేపీ ఆవిర్భావం తర్వాత 12 మంది అధ్యక్షులుగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం మరో ముగ్గురు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఇప్పటి వరకు మొత్తం 15 మంది అధ్యక్షులు బాధ్యతలు చేపట్టగా, అందరూ పురుషులే. తొలిసారిగా మహిళా నాయకురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరికి అధ్యక్షురాలిగా బీజేపీ అవకాశం కల్పించింది. జూలై 2023లో బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమెను ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రెండో కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి. బీజేపీ, అన్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో పురంధేశ్వరి రాజకీయ ప్రస్థానం కొనసాగింది. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, రాజసభ సభ్యునిగా వ్యవహరించారు. పురంధేశ్వరి 2004లో బాపట్ల, 2009లో విశాఖ పట్నం లో కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచారు. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో రాజంపేట, విశాఖపట్నం స్థానాల నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2009, 2012 లో ఆమె కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజనకు నిరసనగా కాంగ్రెస్ కు పురంధేశ్వరి రాజీనామా చేసి, 2014లో బీజేపీలో చేరారు. 2014లో రాజంపేట నుంచి బీజేపీ టికెట్ పై లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీ అనుబంధ విభాగం మహిళా మోర్చాలో నియమితులయ్యారు. ఆపార్టీ ఒడిశా ఇన్ చార్జిగా కూడా వ్యవహరించారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు కొనసాగిస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు ఆమెను చిన్నమ్మగా పిలుచుకుంటారు.
– ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా పోటీ చేయని షర్మిల
ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా పోటీ చేయని షర్మిలను కాంగ్రెస్ అధినాయత్వం ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ పార్టీలోనూ ఆమె ఇప్పటివరకు ఏ పదవినీ చేపట్టకుండానే, ఎన్నికల గోదాలోకి దిగకుండానే షర్మిల పీసీసీ పగ్గాలు చేపడుతుండడం ఆసక్తిగా మారింది. అన్న జగన్ స్థాపించిన వైసీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. జగన్ వదిలిన బాణంగా రాష్ట్ర రాజకీయాల్లోకి దూసుకొచ్చారు. జగన్ వదలిన బాణంగా ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర చేపట్టారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లగా, ఆపార్టీని అన్నీ తానై నడిపించారు. తదనంతరం జగన్ తో విభేదించి, తెలంగాణలో వైఎస్సార్టీపీని స్థాపించి, తెలంగాణ శాసన సభకు జరిగిన ఎన్నికల ఆతర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ వైసీపీ అధినేత కాగా, కుమార్తె షర్మిల ఏపీ పీసీసీ సారథ్యం స్వీకరించనున్నారు. అన్నవి అధికార రాజకీయాలు.. చెల్లెలివి విపక్ష బాధ్యతలు కావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా పోటీ చేయని షర్మిల, వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించినా అక్కడా ఏ పదవినీ చేపట్టలేదు. స్వచ్ఛందంగా పార్టీ కోసం పనిచేశారు. ఇప్పడు ఏకంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షురాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 27వ అధ్యక్షురాలిగా నియమితురాలైంది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన నాటినుంచి మహిళలు ఏపీ కాంగ్రెస్ పగ్గాలను ఇంతవరకూ చేపట్టలేదు. ఈ అరుదైన ఘనత షర్మిల దక్కించుకున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన నేతల వారసులెవరూ ఈ పదవిని దక్కించుకోలేకపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఈ క్రెడిట్ ను ఆమె సొంతం చేసుకున్నారు.