ఇద్దరు వైసీపీ సిటింగ్‌లకు టికెట్లు విధాత: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనున్న 5 లోక్ సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. మరో 61అసెంబ్లీ, 20లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సివుంది. ప్రకటించిన తొలి జాబితా మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్దరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు.
కాగా.. ప్రకటించిన అసెంబ్లీ స్థానాల్లో ఇటీవల వైసీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సిటింగ్ ఎమ్మెల్యేలు అర్థర్‌కు నందికొట్కూరు, ఎలిజాకు చింతలపూడి టికెట్లు దక్కాయి. పిఠాపురంలో కాంగ్రెస్ నుంచి సత్యానందరావు, టీడీపీ-జనసేన నుంచి పవన్ కల్యాణ్, వైసీపీ నుంచి వంగ గీతలు పోటీ పడుతున్నారు. అలాగే కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల గోవిందరాజు(ఆవుల గోపి), వైసీపీ నుంచి ఎమ్మెల్సీ జయేంద్ర భరత్‌లు పోటీ పడుతున్నారు. అటు ఒడిస్సా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ అధిష్టానం 49మంది అభ్యర్థులను ప్రకటించింది.